babu gogineni: ఇది దారుణమైన విషయం.. నేరం కూడా!: పవన్ ఫ్యాన్స్, మహేశ్ కత్తి గొడవపై బాబు గోగినేని స్పందన
- మహేశ్ కత్తికి శ్రద్ధాంజలి అంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు చేస్తున్నారు
- మీకు ఇష్టం లేకపోతే మహశ్ కత్తి చేస్తోన్న ట్వీట్లను చూడకుండా ఉండండి
- అలాగే, మనకు ఇష్టం లేకపోతే పవన్ కల్యాణ్ సినిమాలు చూడకూడదు
- విమర్శ చేయడం వేరు.. రాళ్లు వేయడం, బురద చల్లడం వేరు
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తోన్న సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తిపై పవన్ అభిమానులు విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో ఈ అంశమే హాట్ టాపిక్‌గా మారుతోంది. దీనిపై ప్రముఖ హేతువాది బాబు గోగినేని స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... "మహేశ్ కత్తికి శ్రద్ధాంజలి అంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఒక బతికున్న మనిషిని చనిపోయాడని చెప్పడం దారుణమైన విషయం.. అంతకన్నా ఎక్కువగా ఇదో క్రిమినల్ మేటర్. అది పక్కన పెడితే, మహేశ్ కత్తికి, పవన్ కల్యాణ్‌కి ఇద్దరికీ హక్కులు ఉంటాయి.. ఈ జరుగుతోన్న దెబ్బలాటలో ఈ ఇద్దరి వ్యక్తులను కించపరుస్తున్నారు... తమ తమ ఫ్యాన్స్ ఇలా చేస్తోన్న కారణంగా నష్టపోయేది పవన్ కల్యాణ్, మహేశ్ కత్తి మాత్రమే.
విమర్శ చేయడం వేరు.. రాళ్లు వేయడం, బురద చల్లడం వేరు.. మా అభిమాన స్టార్‌ని అందరూ మెచ్చుకోవాల్సిందే అనడం తప్పు.. విమర్శిస్తే చంపేస్తాం అని మాట్లాడుతుండడం తప్పు. కొడతామంటేనే తప్పు.. అటువంటిది చంపేస్తామని కొందరు అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంత సంయమనం పాటించాలి. ఇష్టం లేకపోతే పవన్ కల్యాణ్ సినిమాలు చూడకూడదు.. ఇష్టం లేకపోతే మహశ్ కత్తి చేస్తోన్న ట్వీట్లను చూడకుండా ఉండండి.." అంటూ బాబు గోగినేని వ్యాఖ్యానించారు.