polling: ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం.. తెలంగాణ సహా పలు రాష్ట్రాల పరిశీలన!
- పోలింగ్ బూత్ కు వెళ్లకుండానే ఓటు వేసే అవకాశం
- పరిశీలిస్తున్న పలు రాష్ట్రాలు
- కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం
పోలింగ్ బూత్ కు వెళ్లి, మండుటెండలో క్యూ లైన్లో నిలబడి ఓటు వేసే అవసరం లేకుండా... ఇంటి వద్ద నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి. గుజరాత్ మునిసిపల్ ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇటీవల జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాల కమిషనర్లు భేటీ అయినప్పుడు ఈ విధానంపై చర్చ జరిగింది.
ఇదే విధానాన్ని ఎన్నికల్లో అమలు చేస్తే ఎన్నికలకు చేసే కోట్లాది రూపాయల ఖర్చు తగ్గిపోతుందని, ఇదే సమయంలో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొలుత ఈ విధానాన్ని రక్షణ దళాలవారికి, ఎన్నికల విధుల్లో ఉన్నవారికి, ఎన్నారైలకు వర్తింపజేయాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత ఓటర్లందరికీ వర్తింపజేస్తారు. ఈ విషయమై కేంద్రప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది.