Lalu Prasad Yadav: లాలూ సోదరి మృతి... జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం!
- పశుదాణా కేసులో జైలులో ఉన్న లాలూ
- ఆయన జైలుకు వెళ్లినప్పటి నుంచి క్షీణించిన లాలూ సోదరి ఆరోగ్యం
- ఆదివారం నాడు మృతి - నేడు పెరోల్ పిటిషన్ వేయనున్న లాలూ
ఆర్జేడీ అధినేత, పశుదాణా కుంభకోణంలో మూడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవించాల్సివున్న లాలూ ప్రసాద్ యాదవ్ సోదరి గంగోత్రి నిన్న కన్నుమూశారు. ఆమె లాలూ కన్నా నాలుగు సంవత్సరాలు పెద్ద. ఆమె లాలూను చిన్న వయసు నుంచే అభిమానించేదని, తన సోదరుడికి తిరిగి అధికారం దక్కాలని, మహాకూటమి అధికారంలోకి రావాలని మూడేళ్ల క్రితం ఆమె కఠోర ఉపవాస దీక్షలు చేసిందని తెలుస్తోంది.
తన సోదరుడు జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించిందని లాలూ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక తన సోదరి మృతితో జైల్లో ఉన్న లాలూ ఆవేదనకు గురైనట్టు సమాచారం. ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన నేడు పెరోల్ పిటిషన్ వేయనుండగా, మానవతాదృక్పథంతో కోర్టు ఆయనకు పెరోల్ మంజూరు చేయవచ్చని సమాచారం. లాలూ పెరోల్ పిటిషన్ పై ఈ ఉదయం 10 గంటల తరువాత కోర్టు విచారణ జరపనుంది.