jaitley: రాజకీయ విరాళాల ప్రక్షాళనకు సిద్ధం... ఎవరైనా సూచనలు ఇవ్వొచ్చు: అరుణ్ జైట్లీ
- పారదర్శకత లోపించింది
- నగదు రూపంలో ప్రస్తుతం విరాళాలు
- ప్రత్యామ్నాయాలను పార్టీలు నిరాకరిస్తున్నాయి
ఎలక్టోరల్ బాండ్లు అన్నవి ప్రస్తుతమున్న విధానం కంటే మెరుగైనవిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రస్తుత విధానంలో అయితే రాజకీయ పార్టీలకు నిధులు నగదు రూపంలో వస్తున్నాయి. దీని స్థానంలో బాండ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తెలియని వ్యక్తుల నుంచి నల్లధనం పార్టీలకు పెద్ద ఎత్తున వస్తుండడం, వాటిని పార్టీలు బయటకు వెల్లడించడం లేదన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు విరాళాల విధానాన్ని సంస్కరించేందుకు సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని జైట్లీ చెప్పారు. ‘‘ఈ మొత్తం వ్యవహారం పారదర్శకత అన్నది లేకుండా పోయింది. చాలా రాజకీయ పార్టీలు ప్రస్తుత విధానం పట్ల సంతృప్తితో ఉండడడమే కాకుండా ప్రత్యామ్నాయాలను నిరాకరిస్తున్నాయి. కనుక రాజకీయ పార్టీలకు నిధుల సాయాన్ని ప్రక్షాళన చేసే ప్రత్యామ్నాయ విధానం అవసరం’’ అని జైట్లీ వివరించారు.