kim: ట్రంప్ లో మార్పు వచ్చిందా..? కిమ్ తో మాట్లాడడానికి సిద్ధమని ప్రకటన
- ఎటువంటి ముందస్తు షరతులు ఉండరాదు
- మాట్లాడేందుకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు
- కొరియా దేశాల మధ్య చర్చలతో సత్ఫలితాలపై ఆశాభావం
అమెరికా, ఉత్తరకొరియాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇంతటితోనే ఆగిపోయే సంకేతాలు వస్తున్నాయి. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తో ఫోన్లో మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇందులో తనకెటువంటి ఇబ్బంది లేదన్నారు. కాకపోతే ఏ విధమైన ముందస్తు షరతులు ఉండరాదన్న సంకేతమిచ్చారు. ఈ మేరకు మేరీల్యాండ్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల మధ్య చర్చలతో సానుకూల ఫలితాలు వస్తాయన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. వచ్చేవారం దక్షిణ కొరియాతో అధికారికంగా చర్చలు జరిపేందుకు ఉత్తరకొరియా అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్ ఇలా స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన దగ్గర్నుంచి అమెరికా, ఉత్తరకొరియా అధినేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే.