Hyderabad: ఫేస్బుక్ ద్వారా అమ్మాయిని వేధిస్తూ.. ఆమెకు కాబోయే భర్తకు ఫొటోలు పంపిన పోకిరీ అరెస్ట్!
- గతంలో యువతితో ఫొటోలు తీసుకున్న యువకుడు
- తనను పెళ్లి చేసుకోవాలని బెదిరింపులు
- ఎట్టకేలకు సంజీవయ్య పార్కులో పట్టుకున్న పోలీసులు
తనకు వివాహం నిశ్చయమైందని చెప్పినప్పటికీ ఓ యువతిని వేధిస్తున్నాడు ఓ యువకుడు. ఆమెతో గతంలో ఉన్న పరిచయం వల్ల గోల్కొండ కోటలో ముస్తఫా అనే ఓ యువకుడు ఆమెతో ఫోటోలు తీసుకున్నాడు. కొంత కాలంగా ఆమెను పెళ్లి చేసుకుంటానని ఫేస్బుక్లో చెబుతున్నాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో ఫేస్బుక్లో యువతి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాడు. అంతేగాక, ఆమెకు ఫోన్ చేసి వేధిస్తున్నాడు.
ఆ యువతి కాబోయే భర్తకు కూడా ఫొటోలు పంపాడు. తాము ప్రేమలో ఉన్నామని ఆ యువతిని పెళ్లి చేసుకోవద్దని కోరుతున్నాడు. దీంతో ఆ యువతి షీ టీమ్ ని ఆశ్రయించగా, అతడిపై నిఘా వేసిన ఆ టీమ్ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కు వద్ద ఎట్టకేలకు పట్టుకున్నారు. తాము ఆ పోకిరీని పట్టుకున్న సమయంలోనూ అతడు మరికొందరితో కలిసి అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.