Revanth Reddy: అనుమతి లేని కళాశాలలో చేరితే డాక్టర్ ఎలా అవుతారు?: మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి విమర్శలు
- లక్ష్మారెడ్డి విద్యార్హతలపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు
- ఓసారి లక్ష్మారెడ్డి గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందానని చెప్పారు
- మరోసారి హైదరాబాద్ కర్ణాటక విశ్వవిద్యాలయంలో చదివానన్నారు
తెలంగాణ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విద్యార్హతలపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్‌లో లక్ష్మారెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరోసారి లక్ష్మారెడ్డిపై విమర్శలు చేశారు. అనుమతి లేని కళాశాలలో చేరితే డాక్టర్ ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు.
ఓసారి లక్ష్మారెడ్డి గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందానని చెప్పారని, మరోసారి హైదరాబాద్ కర్ణాటక విశ్వవిద్యాలయంలో చదివానని అన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. 1981లో వైద్య విద్య కోసం అడ్మిషన్ తీసుకున్న లక్ష్మారెడ్డి 1988లో పాసయ్యానని చెప్పారని, ఆయన చెప్పిన వర్సిటీల్లో ఒకదానికి అప్పట్లో అనుమతి లేదని అన్నారు. అంతేగాక, పాలమూరు జిల్లాలోని ఆవంచ ప్రాంతంలో ప్రాక్టీస్ చేశానని లక్ష్మారెడ్డి అన్నారని, ఆయన ఇందుకోసం పేరు నమోదు చేసుకున్న సంబంధిత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.