modi: మోదీ తన భార్యను ఏలుకోవాలి.. లేదా విడాకులు ఇచ్చేయాలి: మియాపూర్ డాక్టర్ డిమాండ్
- మోదీ తన భార్యను ఏలుకోవాలి
- లేదంటే విడాకులు ఇచ్చేసి సెక్యూరిటీ తీసేయాలి
- ప్రధానే ఇలా చేస్తుంటే ఎలా అని ప్రశ్నిస్తున్న డాక్టర్ సుశీల
ప్రధాని మోదీ తన భార్యకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మియాపూర్ లోని తన నివాసంలో ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న డాక్టర్ సుశీల... మోదీ తన భార్యను ఏలుకోవాలి, లేదంటే విడాకులు ఇచ్చి తన సచ్చీలతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డాక్టర్ సుశీల ఓ వార్తా చానల్ తో మాట్లాడారు.
‘‘తనకు సెక్యూరిటీ వద్దని, మోదీ అనుమతిస్తే ఆయనతో సహజీవనం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జశోదాబెన్ గతంలోనే ప్రకటించారు. కానీ, అందుకు మోదీ సిద్ధంగా లేరు. సిద్ధంగా లేనప్పుడు విడాకులు ఇచ్చేసి సెక్యూరిటీ తీసేయమని చెప్పండి. నాకు సంబంధం లేదని చెప్పకుండా దేశ ప్రజలను మోసం చేయడం ఎందుకు?’’ అని సుశీల ప్రశ్నించారు.
జెశోదాబెన్ కూడా ఒక స్త్రీయేనని, తాను కూడా ఒక స్త్రీ కావడంతో మద్దతుగా నిలుస్తానని అన్నారు. ప్రధానే ఇలా చేస్తుంటే, రేపు ఎంత మంది స్త్రీలకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ప్రధాని భార్య అంటే అందరికీ తల్లిలాంటిదని, కనుక ప్రశ్నించే బాధ్యత మనపై ఉంటుందని అన్నారు. ఒక్కదానినే ఈ ఉద్యమం ప్రారంభించానని, దేశ, విదేశాల నుంచి ఫేస్ బుక్ వేదికగా సపోర్ట్ చేస్తున్నారని చెబుతూ, ఇది ఢిల్లీ వరకు చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.