India: బ్యాట్స్‌మెన్ విఫలం.. టీమ్ ఇండియా 28/3.. భారమంతా పుజారా, రోహిత్ పైనే..!
- తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతున్న భారత్
- 30 పరుగులైనా చేయకుండానే మూడు వికెట్ల సమర్పణ
- నేడు బౌలింగ్‌కు మరింతగా అనుకూలించనున్న పిచ్
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 286 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందం భారత్‌కు ఎంతో సేపు నిలవలేదు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా దక్షిణాఫ్రికా గడ్డపైనా సిరీస్ గెలిచి రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్టుగానే తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలను 300 పరుగుల లోపే ఆలౌట్ చేసింది.
సీమర్ భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరిగే బంతులకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మిగతా పనిని స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీ కానిచ్చేశారు. ఏబీ డివిలియర్స్ (65), కెప్టెన్ డుప్లెసిస్ (62), క్వింటన్ డికాక్ (43) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. ఫలితంగా దక్షిణాఫ్రికా 286 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. భువనేశ్వర్ కుమార్ 4, అశ్విన్ 2 వికెట్లు తీసుకోగా, పాండ్యా, బుమ్రా, షమీ చెరో వికెట్ నేలకూల్చారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ మురళీ విజయ్ (1) ఫిలాండర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (16) కూడా పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 18 పరుగులే. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (5) జట్టును ఆదుకుంటాడని అందరూ భావించారు. అయితే మోర్కెల్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం చటేశ్వర్ పుజారా (5), రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, స్టెయిన్, మోర్కెల్ చెరో వికెట్ తీశారు.
మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మొగ్గుచూపకూడదంటే భారత్ నేడు నిలకడగా ఆడాల్సి ఉంటుంది. ఇంకా 258 పరుగులు చేస్తేనే దక్షిణాఫ్రికాకు ఆధిక్యం కోల్పోకుండా ఉంటుంది. అలా జరగాలంటే క్రీజులో ఉన్న పుజారా, రోహిత్ శర్మలు నిలకడగా ఆడాలి. వీరిద్దరికీ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే అనుభవం ఉండడంతో తొలి ఇన్నింగ్స్ ఇప్పుడు వీరి భుజాలపైనే ఉంది. అయితే పిచ్ రెండో రోజు బౌలింగ్‌కు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉండడంతో భారత బ్యాట్స్‌మెన్ ఏమాత్రం నిలదొక్కుకుంటారో వేచి చూడాల్సిందే.