ghajal Srinivas: గజల్ శ్రీనివాస్ ను పోలీస్ కస్టడీకి అనుమతించని న్యాయమూర్తి... కారణమిదే!
- లైంగిక వేధింపుల కేసులో పట్టుబడిన గజల్ శ్రీనివాస్
- కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసుల పిటిషన్
- వీడియో సాక్ష్యాలుండగా, ఇంకేం విచారిస్తారని ప్రశ్నించిన న్యాయమూర్తి
- నేడు మరోమారు కోర్టు ముందుకు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్
తన కార్యాలయంలోని ఉద్యోగిని లైంగికంగా వేధించిన ఘటనలో అడ్డంగా బుక్కై జైలుకు వెళ్లిన గాయకుడు గజల్ శ్రీనివాస్ ను కనీసం నాలుగు రోజుల పాటు విచారించి, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుంటామని చెబుతూ, పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన వేళ, న్యాయమూర్తి దాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ ను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించడం గమనార్హం. రిమాండ్ రిపోర్టులో విచారణకు సంబంధించిన వివరాలను పొందుపరిచి, వీడియోలతో సహా అన్ని ఆధారాలనూ సంపాదించిన తరువాత ఆయన్ను ఏం విచారిస్తారని ప్రశ్నించారు. ఆయన్నుంచి ఎటువంటి రికవరీ అవసరం లేదని రిపోర్టులో పేర్కొన్నారు కాబట్టి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. కాగా, కస్టడీ పిటిషన్ ను తిరస్కరించిన తరువాత గజల్ శ్రీనివాస్ నేడు మరోమారు కోర్టు ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.