prime number: అతిపెద్ద ప్రధాన సంఖ్య కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
- 23 మిలియన్ల అంకెలతో కూడిన సంఖ్య
- M77232917గా గుర్తింపు
- ఆరు రోజులు కంప్యూటింగ్ చేసి వెల్లడి
ప్రధాన సంఖ్యల్లో అతిపెద్ద ప్రధాన సంఖ్యను అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెన్నెసీ గణిత శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ సంఖ్యలో మొత్తం 23 మిలియన్ల అంకెలు ఉన్నాయి. దీనికి క్లుప్తంగా M77232917 అని పేరు పెట్టారు. రెండుని 77,232,917 సార్లు గుణించి, వచ్చిన ఫలితం నుంచి ఒకటిని తీసివేయడం ద్వారా 23,249,425 అంకెలు ఉన్న ఈ అతిపెద్ద ప్రధాన సంఖ్యను గుర్తించారు. గతంలో గుర్తించిన అతిపెద్ద ప్రధాన సంఖ్య కంటే ఇందులో 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి.
ఇలా రెండుకి ఘాతాలు చేసి, ఒకటిని తీసివేయడం ద్వారా ప్రధాన సంఖ్యను కనిపెట్టే విధానాన్ని ఫ్రెంచ్ సన్యాసి మారిన్ మెర్సీన్ కనిపెట్టారు. ఆయన పేరు మీదుగానే అతిపెద్ద ప్రధాన సంఖ్యలను మెర్సీన్ సంఖ్యలు అంటారు. ఇప్పటివరకు 49 మెర్సీన్ సంఖ్యలు ఉన్నాయి. ఈ కొత్తగా కనిపెట్టిన ప్రధాన సంఖ్య 50వ మెర్సీన్ సంఖ్య. జోనథాన్ పేస్ అనే వ్యక్తి కంప్యూటర్‌లో ఆరు రోజుల పాటు నిరంతర కంప్యూటింగ్ చేసి ఈ ప్రధాన సంఖ్యను కనిపెట్టారు. ఇందుకు గాను పేస్‌కి 3000 డాలర్ల బహుమతి లభించనుంది.