Chandrababu: అధికారుల తీరుతో మంత్రులకు అవమానాలు... సర్దిచెప్పలేక చంద్రబాబు తిప్పలు!

  • మంత్రులకు వరుసగా అవమానాలు
  • దుర్గగుడిలో చర్చలకు ఆహ్వానం లేని మాణిక్యాలరావు
  • విద్యా సంస్థ ప్రారంభోత్సవానికి గంటాకు అందని ఆహ్వానం
  • ఫోరెన్సిక్ ల్యాబ్ శంకుస్థాపనకు చినరాజప్పకు పోస్టులో ఆహ్వానం
  • మంత్రులకు సర్దిచెప్పిన చంద్రబాబు

మొన్న దేవాదాయ మంత్రి, ఆ తరువాత విద్యా శాఖ మంత్రి, ఇప్పుడు హోమ్ మంత్రి... అధికారుల అలసత్వంతో మంత్రులు అవమానపడుతున్న వేళ, వారికి సర్దిచెప్పలేక సీఎం చంద్రబాబు నానా తంటాలూ పడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రొటోకాల్ ను పాటించకపోవడం, కనీసం వారి వారి శాఖలకు చెందిన అధికారిక కార్యక్రమాల గురించి కూడా సమాచారం ఇవ్వకపోవడం చంద్రబాబుకు సైతం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

గత దసరా సీజన్ లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన అధికారుల సమావేశానికి దేవాదాయ మంత్రి మాణిక్యాలరావును పిలవకపోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. అమరావతిలో ఓ విద్యా సంస్థ ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు హాజరైన వేళ, సంబంధిత మంత్రి గంటా శ్రీనివాసరావును పిలవలేదు. ఈ ఘటనలపై చంద్రబాబు వారికి సర్దిచెప్పి, ఇకపై అలా జరుగకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు కూడా.

ఈ ఘటనలు మరువకముందే, తాజాగా, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ శంకుస్థాపనకు హోమ్ మంత్రి చినరాజప్పకు ఆహ్వానం అందలేదు. ఆయన ఇంటికి పోస్టు ద్వారా ఆహ్వానాన్ని పంపి చేతులు దులిపేసుకున్నారు అధికారులు. అందరూ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ శంకుస్థాపనలో బిజీగా ఉన్న వేళ, అలకబూనిన చినరాజప్ప, తిరుమలకు వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం గమనార్హం. చినరాజప్పకు పిలుపు అందక పోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు, చినరాజప్పను పిలిపించి మాట్లాడారు. ప్రకాశం బ్యారేజ్ ఆరు దశాబ్దాల వేడుకల వేళ, ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి అలకతీర్చారు. ఏదిఏమైనా అధికారుల తీరు అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న చంద్రబాబును కొంతమేరకు ఇబ్బంది పెట్టేలా ఉంటోంది. వారు తమ తీరును మార్చుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు.

Chandrababu
Andhra Pradesh
Ganta Srinivas
Chinarajappa
  • Loading...

More Telugu News