SBI: ఎస్బీఐ సంచలన నిర్ణయం.. కనీస నగదు నిల్వ రూ.1000కి తగ్గింపు.. ఖాతాదారులకు భారీ ఊరట?
- ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్న ఎస్బీఐ
- కనీస నిల్వను రూ.3 వేల నుంచి రూ.1000కి తగ్గింపు
- ప్రభుత్వ ఒత్తిడితో సమీక్షించాలని నిర్ణయం
- త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కనీస నగదు నిల్వ విషయంలో ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండడంతో ఈ విషయాన్ని సమీక్షించాలని నిర్ణయించింది. పట్టణాల్లో రూ.3 వేలుగా ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను వెయ్యి రూపాయలకు తగ్గించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
గతేడాది ఏప్రిల్-నవంబరు మధ్య కనీస నిల్వను పాటించని ఖాతాదారుల నుంచి రూ.1,772 కోట్లు వసూలు చేసినట్టు తాజాగా ఎస్బీఐ ప్రకటించింది. అయితే అంతలోనే ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ప్రభుత్వ ఒత్తిడి ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను రూ.1000కి తగ్గించాలని నిర్ణయించింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
గతేడాది జూన్లో ఎస్బీఐ కనీస నగదు నిల్వను రూ.5 వేలకు పెంచింది. ఖాతాదారుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మెట్రో నగరాల్లో రూ.3 వేలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 కనీస నగదు నిల్వ ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతకు మించి తగ్గితే ఆయా ప్రాంతాలను బట్టి జరిమానా కింద రూ.25 నుంచి రూ.100 వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.
తాజాగా మినిమమ్ బ్యాలెన్స్ విధానంపై సమీక్ష జరపాలని, కనీస నగదు నిల్వను రూ.1000కు తగ్గించాలని నిర్ణయించింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు.