amaravathi: పర్యాటకులను ఆకర్షించనున్న ఏపీ .. కృష్ణాన‌దీ జ‌లాల‌లో హౌస్ బోట్స్!

  • విజ‌య‌వాడ ప్ర‌కాశం బ్యారేజ్ న‌దీ జ‌లాల‌లో హౌస్ బోట్స్
  • తొలి ద‌శ‌లో 15 హౌస్ బోట్స్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణయం
  • ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా

ఏపీకి పర్యాటకులను ఆకర్షించే దిశగా పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. కేరళ పర్యాటకానికి ఏమాత్రం తీసిపోని రీతిలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా..ప్రత్యేకించి దళితుల స్వయం ఉపాధికి సైతం ఉపకరించేలా ఇది రూపుదిద్దుకుంటోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం అథారిటీపై ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా సచివాలయంలో ఈరోజు స‌మీక్ష నిర్వ‌హించారు. 

ఈ సందర్భంగా హౌస్ బోట్స్ కు సంబంధించిన ప్రాజెక్టుపై మీనా స్ప‌ష్ట‌త ఇచ్చారు. విజ‌య‌వాడ ప్ర‌కాశం బ్యారేజ్ చెంత న‌దీ జ‌లాల‌లో హౌస్ బోట్స్ ప‌ర్యాట‌కులకు మంచి అనుభూతిని పంచనున్నాయని, తొలి ద‌శ‌లో 15 హౌస్ బోట్స్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించినట్టు చెప్పారు.
ల‌బ్ధిదారుల ఎంపిక‌లో అనుభ‌వానికి అత్య‌ధిక ప్రాధ‌న్య‌త ఇస్తామ‌ని, అదే క్ర‌మంలో ఆదాయ భాగ‌స్వామ్యం అవ‌శ్య‌క‌త కూడా ఉంటుంద‌ని చెప్పారు. అయితే ఇప్ప‌టికే ఏపీటీడీసీ హౌస్ బోట్స్ ఏర్పాటుకు అవ‌స‌రమైన వ్యయాన్ని అంచ‌నా వేయ‌టం జ‌రిగింద‌ని, ప‌డ‌వ సామర్ధ్యం సౌక‌ర్యాల ప్రాతిప‌దిక‌న రూ. 60 ల‌క్ష‌ల నుండి కోటి ఇర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు వ్య‌యం అవుతుంద‌ని పేర్కొన్నారు. 

ల‌బ్ధిదారులు ఏ బోటునైనా కొనుగోలు చేసుకోవ‌చ్చ‌ని, స‌బ్స‌ిడీ మాత్రం కోటి రూపాయ‌ల ప్రాజెక్టుకు లోబ‌డే ఉంటుంద‌ని ముఖేష్ కుమార్ మీనా వివ‌రించారు. అటు సాంఘిక సంక్షేమ శాఖ‌, ఇటు ఎస్‌సి కార్పోరేష‌న్‌తో ప‌ర్యాట‌క శాఖ సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా హౌస్ బోట్స్ లో కృష్ణాన‌దిలో న‌దీ విహారం చేయించాల‌న్న‌దే ప‌ర్యాట‌క శాఖ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు.
కాగా, ప్ర‌తి ప‌డ‌వ‌ ఏర్పాటుకు సుమారు కోటి రూపాయల వ్య‌యం కానుంది. ఇందులో 15 శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ, ఎస్సీ కార్పొరేష‌న్ కొంత మొత్తాన్ని స‌బ్సిడీ రూపంలో భ‌రించేందుకు సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించింది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుండి రుణం స‌మ‌కూర్చేలా ప‌ర్యాట‌క శాఖ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తోంది. అయితే సాధార‌ణ వ్య‌క్తులు సైతం ఈ హౌస్ బోట్స్ ను ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉండ‌గా, వీరికి కూడా 15 శాతం ఏపీటీడీసీ స‌బ్సిడీ వ‌ర్తిస్తుంది. మిగిలిన 85 శాతాన్ని స్వ‌యంగా కాని, బ్యాంకు రుణం రూపంలోకాని ల‌బ్ధిదారులు స‌మ‌కూర్చుకోవ‌ల‌సి ఉంటుంది. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని ఏపీటీడీసీ ప‌ర్య‌వేక్షించ‌నుంది. 

  • Loading...

More Telugu News