godavari: గోదావరి జిల్లాల్లో కోడి పందేలు .. బరిలో పాకిస్తాన్ కోళ్లు!

  • గోదావరి జిల్లాల కోళ్లతో తలపడేందుకు పాకిస్తాన్ కోళ్లు
  • తైవాన్, ఇండోనేషియా, మలేషియా బ్రీడ్స్ కోళ్లను తెప్పిస్తున్న వైనం
  • ఆయా దేశపు కోళ్లను తెప్పించుకుంటున్న నిర్వాహకులు

మరో వారం రోజుల్లో సంక్రాంతి పండగ రానుంది. ఈ సంక్రాంతి అనగానే, ఇంటి ముంగిట అమ్మాయిలు అందంగా వేసే రంగురంగుల ముగ్గులు, నోరూరించే పిండి వంటలు, భోగి మంటలు, సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ప్రముఖ హీరోల సినిమాలు, సందడి చేసే అభిమానులు.. కనపడతారు. మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాలి. అవేమిటంటే, గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోడిపందేలు! పందెం బరిలో దిగే కోడి పుంజులతో పాటు వాటి నిర్వాహకులు కూడా ఎంతో ఉత్సాహంగా పోటీపడతారు.

ఇప్పటికే కోనసీమలో ఈ సందడి మొదలైంది. ఈసారి జరిగే కోడి పందేలకు ఓ ప్రత్యేకత ఉంది. గోదావరి జిల్లాల కోళ్లతో తలపడేందుకు పాకిస్తాన్ కోళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు. కోనసీమ పందెం కోళ్ల పెంపకందారులు ఆ దేశపు కోళ్ల బ్రీడ్ ను ఇక్కడికి తెప్పించుకుని పెంచుతున్నారు. పాక్ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. కేవలం పాక్ దేశపు కోళ్లనే కాకుండా తైవాన్, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి ఆయా బ్రీడ్స్ కోళ్లను తెప్పించి పెంచుతున్నారని సమాచారం.

కోళ్ల కాళ్లకు కత్తులు కట్టకుండా వేసే పందేల్లో పాక్ బ్రీడ్ కోళ్లు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. కాగా, గతంలో వేల రూపాయలతో మొదలైన  కోడి పందేలు.. ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది తూర్పుగోదావరి జిల్లాలో వంద కోట్ల రూపాయలకు పైగా చేతులు మారాయి. పశ్చిమగోదావరి జిల్లా కూడా అదే బాటలో పయనించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పందెంలో వీరోచితంగా పోరాడి మరణించిన కోడి పుంజుల మాంసానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే, పందెం కోళ్లకు బలమైన ఆహారం తినిపిస్తారు. ఒక్కో కోడి కోసం వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ, వాటిని ఎంతో బలంగా నిర్వాహకులు తయారు చేస్తారు. దీంతో, పందెంలో వీరమరణం పొందిన కోడి పుంజు మాంసం మంచి ధర పలుకుతుంది.

  • Loading...

More Telugu News