ripple: బిట్ కాయిన్ ను మరిపిస్తున్న రిపిల్, ఏడాదిలో 49,500 శాతం లాభం!
- గత వారం రోజుల్లోనే 160 శాతం అప్
- 122 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ
- బిట్ కాయిన్ తర్వాత రెండో స్థానానికి చేరిక
బిట్ కాయిన్ గురించి ఇటీవలి కాలంలో తెగ ప్రచారం వినిపిస్తోంది. ఇదొక క్రిప్టోకరెన్సీ. గడిచిన ఏడాది కాలంలో 13 రెట్లు పెరిగింది. ఇదే విభాగంలో మరో క్రిప్టోకరెన్సీ అయిన రిపిల్ కూడా లాభాల్లో బిట్ కాయిన్ ను మరిపిస్తోంది. ఎందుకంటే గడిచిన ఏడాది కాలంలో ఇది కూడా ఏకంగా 49,500 శాతం పెరిగింది. ముఖ్యంగా బుధవారం ఈ క్రిప్టో కరెన్సీ ఏకంగా 29 శాతం పెరిగి 3.20 డాలర్లకు చేరింది. రిపిల్ కు ఎక్స్ఆర్పీ అసలు పేరు. నిజానికి రిపిల్ అన్నది కంపెనీ పేరు. ఇది ఎక్స్ఆర్పీ అనే క్రిప్టోకరెన్సీని సృష్టించింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ తాజాగా 122.7 బిలియన్ డాలర్లకు చేరింది. క్రిప్టో కరెన్సీల్లో మార్కెట్ విలువ పరంగా బిట్ కాయిన్ తర్వాత రెండో స్థానంలోకి వచ్చింది. బిట్ కాయిన్ మార్కెట్ విలువ 251 బిలియన్ డాలర్లు. ఒక్క గత వారం రోజుల్లోనే రిపిల్ 160 శాతం పెరిగి ఇన్వెస్టర్లను తెల్లబోయేలా చేసింది. పెద్ద పెద్ద ఆర్థిక సంస్థల మధ్య బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా దేశాంతర లావాదేవీలకు రిపిల్ వీలు కల్పిస్తుంది.