blue whale: బ్లూ వేల్ కారణంగా దేశంలో ఎవరూ చనిపోలేదు... స్పష్టం చేసిన కేంద్రం
- లోక్‌సభలో వెల్లడించిన హోంశాఖ సహాయమంత్రి
- కమిటీ విచారణలో తేలిందని వ్యాఖ్య
- సంభవించిన మరణాలన్నీ ఇతర కారణాల వల్లే అని స్పష్టత
గతేడాది సంచలనం సృష్టించిన స్మార్ట్‌ఫోన్ గేమ్ బ్లూవేల్ కారణంగా దేశంలో ఎవరూ చనిపోలేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కొంతమంది టీనేజర్ల ఆత్మహత్యలకు ఈ గేమ్ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ప్రభుత్వం చొరవ తీసుకుందని, అందుకోసం ఓ కమిటీ కూడా ఏర్పాటుచేసిందని చెబుతూ ఆ కమిటీ నివేదికను కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ బ్లూవేల్ కారణంగా జరిగిన ఆత్మహత్యలపై అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా ఆత్మహత్య చేసుకున్న చిన్నారుల ఇంటర్నెట్, సోషల్ మీడియా, చాటింగ్ కార్యకలాపాలను విశ్లేషించారు. ఈ విశ్లేషణలో భాగంగా వారి ఆత్మహత్యకు బ్లూవేల్ గేమ్ కారణం కాదని, వేరే ఇతర కారణాల వల్ల వారు మరణించినట్లు తేలిందని హన్స్‌రాజ్ తెలిపారు. వివిధ రకాల టాస్క్‌లు చేయమని చెబుతూ చివరి లెవల్‌లో ఆత్మహత్య చేసుకోవాలని బ్లూవేల్ గేమ్ ఆదేశాలిస్తుంది. ఆ గేమ్‌లో లీనమైన వారు ఆ ఆదేశాన్ని పాటించి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడతారు.