h1b visa: ఎన్నారైలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ట్రంప్.. 15 లక్షల మంది తిరిగిరాక తప్పదా?
- దడ పుట్టిస్తున్న 'బై అమెరికన్ - హైర్ అమెరికన్'
- కొత్త నిబంధనలు వాస్తవరూపం దాలిస్తే ప్రకంపనలే
- 15 లక్షల మంది ఎన్నారైలు తిరిగిరావాల్సిందే
అమెరికాలో ఉన్న 15 లక్షల మంది భారతీయులు ఉన్నపళంగా స్వదేశానికి తిరిగిరాక తప్పదా? పీడకలలాంటి ఈ ఊహ నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనికంతటికీ ట్రంప్ సర్కారు తీసుకున్న ఓ కీలక నిర్ణయమే కారణం. విదేశీయుల హెచ్1బీ వీసాలు ఆటోమేటిక్ గా రెన్యువల్ అయ్యే విధానాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ చాలా సీరియస్ గా పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం ఆరేళ్లకు మించి హెచ్1బీ వీసా పొడిగింపు ఉండదు. ఈ వార్త ఎన్నారైల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
హెచ్1బీ వీసా లాటరీలో అదృష్టం వరించక, గ్రీన్ కార్డు రాక... కనీసం 7.5 లక్షల మంది ఎన్నారైలు అమెరికాను విడిచిపెట్టాల్సి ఉంటుంది. వీరితో పాటు వారి కుటుంబసభ్యులు దాదాపు 8 లక్షల మంది కూడా ఇండియాకు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, దశలవారీగా దాదాపు 15 లక్షల మంది ఎన్నారైలు అమెరికాలో ఉన్నత జీవితానికి ముగింపు పలకాల్సి ఉంటుంది. అమెరికా చరిత్రలో ఇంత భారీ స్థాయిలో భారతీయులను ఇంటికి పంపడం ఇదే తొలిసారి అవుతుందని ఇమిగ్రేషన్ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు మాతృదేశానికి తిరిగి రావడానికి తెలుగువారు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఒక అంచనా ప్రకారం అమెరికాలో ఉన్న దాదాపు 10 లక్షల మంది వీసా హోల్డర్లు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, తాజా ప్రతిపాదనలపై యూఎస్ ఇమిగ్రేషన్ విభాగం నోరు మెదపట్లేదు. ట్రంప్ సర్కారు జారీ చేసిన 'బై అమెరికన్ - హైర్ అమెరికన్' ఆదేశాలను అమలు చేయడానికి తగిన మార్గాలను అన్వేషిస్తున్నామని మీడియా సలహాదారు జొనాథన్ వితింగ్టన్ తెలిపారు. అనేక అంశాలను పరిశీలిస్తున్నామని... ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. మరోవైపు ట్రంప్ సర్కారుతో చర్చలు జరిపి, తమ ఆందోళనను తెలియబరచాలని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.