gajal Srinivas: ఖైదీ నంబర్ 1327... 'గజల్' శీనివాస్ జైలులో గడిపాడిలా!
- వీడియో సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయిన గజల్ శ్రీనివాస్
- జైలులో యూటీ నంబర్ 1327
- తొలి రోజు భోజనం చేయని గాయకుడు
తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినిని లైంగిక వేధింపులకు గురి చేసి, వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన గజల్ శ్రీనివాస్, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నాడు. ఆయనకు యూటీ 1327 నంబరును జైలు అధికారులు కేటాయించారు. బుధవారం ఉదయం వరకూ అడ్మిషన్ బ్లాక్ లోనే ఉంచిన జైలు అధికారులు, ఆపై పలు కేసుల్లో నిందితులుగా ఉన్న రిమాండ్ బ్యారక్ కు తరలించారు.
తొలి రోజు జైలులో భోజనం చేయని ఆయన, బిస్కెట్లు, బ్రెడ్, పండ్లు మాత్రమే తీసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇతర ఖైదీలతో ఆయన మాట్లాడలేదని, కొందరు మాట్లాడించబోయినా ముభావంగా ఉండిపోయాడని తెలుస్తోంది. కాగా, తనకు బెయిల్ ఇవ్వాలంటూ గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని, ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్న పోలీసుల వాదననే కోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చని సమాచారం.