Jet airways: విమానాన్ని గాలికి వదిలేసి.. పైలట్ల డిష్యుం, డిష్యుం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు!
- సమాచార లోపంతో ఘర్షణకు దిగిన పైలట్లు
- లండన్ నుంచి ముంబై వస్తుండగా ఘటన
- విధుల నుంచి తొలగింపు
విమానాన్ని గాలికి వదిలేసి ఇద్దరు పైలట్లు పరస్పరం ఘర్షణకు దిగారు. దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంగా గడిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈనెల 1న జరిగింది. జెట్ ఎయిర్‌వేస్ విమానం 324 మంది ప్రయాణికులతో లండన్ నుంచి ముంబై బయలుదేరింది. సమాచార మార్పిడిలో లోపం కారణంగా కాక్‌పిట్‌లోని పైలట్ల మధ్య వివాదం తలెత్తింది. మొదట చిన్నగా మొదలైన వాగ్వాదం చివరికి బాహాబాహీకి దారి తీసింది.
పైలట్లు విమానాన్ని పట్టించుకోకుండా ఘర్షణకు దిగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే కాసేపటికే పైలట్ల మధ్య వివాదం సమసిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. పైలట్లు గొడవకు దిగడం నిజమేనని జెట్ ఎయిర్‌వేస్ ధ్రువీకరించింది. ఘర్షణకు దిగిన ఇద్దరు పైలట్లను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించి, విచారణ చేపట్టినట్టు తెలిపింది.