Chandrababu: ‘అలిపిరి’ బ్లాస్ట్ ఘటనప్పుడు నేను అక్కడ లేను: ఎస్పీ రామ మోహన్

  • ‘అలిపిరి’ ఘటన జరిగిన సమయంలో నాడు తిరుపతి ఎస్పీగా ఉన్న రామ మోహన్
  • ఈ సమాచారం తెలియగానే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వెళ్లా
  • పదిహేడు క్లైమోర్ మైన్స్ లో తొమ్మిది పేలాయి
  • ఓ ఇంటర్వ్యూలో ఆశ్చర్యకర విషయాలను చెప్పిన రామమోహన్

సుమారు పదిహేనేళ్ల క్రితం నాటి సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని అలిపిరి బాంబు బ్లాస్ట్ ఘటన జరిగిన సంఘటన మర్చిపోలేం. ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఎస్పీగా ఉన్న రామ మోహన్ నాడు తిరుపతి ఎస్పీగా పని చేస్తున్నారు. ఈ సంఘటన గురించి ఆయన ఆశ్చర్యకర విషయాలు చెప్పారు.

‘ఐడ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అప్పుడు మా ఫోరెన్సిక్ లేబొరేటరీ రీజనల్ ఆఫీసు ప్రారంభించడానికి వచ్చిన చంద్రబాబు కొండపైకి వెళ్తున్నారు. మా టీమ్ అంతా ఉంది గానీ, నేను మాత్రం లేను. నేను హైదరాబాద్ లో ఉన్నాను. చంద్రబాబు వెంటే మా టీమ్ వెళ్తుండగా బ్లాస్ట్ అయింది. వెంటనే, ఆ సమాచారం నాకు తెలియజేశారు.

తెల్లవారుజామున ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లిపోయాను. బ్లాస్ట్ గురించి చెప్పాలంటే.. పదిహేడు క్లైమోర్ మైన్స్ పెట్టారు. అందులో తొమ్మిది పేలిపోయాయి. ఒక్కో క్లైమోర్ మైన్ లో డంబెల్ బాల్స్ కూడా పెట్టారు. ఇలా పెట్టడం వలన బాగా ఎటాక్ జరుగుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత మూడు రోజులకు ఈ దృశ్యాలను యానిమేషన్ చేసి చంద్రబాబునాయుడుగారికి చూపించా. ఈ దాడి ఎలా జరిగింది? క్లైమోర్ మైన్స్ ఎలా పెట్టుంటారనే విషయాలను ఆయనకు వివరించా. 17 క్లైమోర్ మైన్స్ కు కనెక్షన్స్ ఇచ్చి ఒక్క ఫ్లాష్ లైట్ తో బ్లాస్ట్ చేశారు.

అలిపిరి ఘటనలో ఫ్లాష్ కెమెరా కనెక్ట్ చేసిన విధానం, అందులో వాడిన పదార్థాల గురించి తెలుసుకున్నాం. నేషనల్ ఫ్లాష్ కెమెరా ప్రత్యేక మోడల్ ని ఈ ఘటనలో ఉపయోగించారు. అంతకుముందు ఎలిమినేటి మాధవరెడ్డిని అటాక్ చేసినప్పుడు, ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ని బ్లాస్ట్ చేసినప్పుడు డంబెల్ బాల్స్ ని వాడటం వంటి ఆధారాలను అలిపిరి బ్లాస్ట్ ఘటన ఆధారాలతో పోల్చి చూసుకుని అప్పుడున్న తీవ్రవాదుల గ్రూప్ చేసిన పని అని చెప్పడం జరిగింది. తిరుమల కొండపై ఈ దాడి జరిగింది కాబట్టి ఫండమెంటల్ గ్రూప్ ఈ పనికి పాల్పడి ఉండవచ్చేమో అనే అనుమానం కూడా వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News