tajmahal: త్వరలో తాజ్‌మహల్ సందర్శకులపై నియంత్రణ?
- యోచిస్తోన్న ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
- రోజుకి 40వేల మందికి మాత్రమే అనుమతి
- వారసత్వ పరిరక్షణలో భాగంగా అమలు
భారతీయ వారసత్వ సంపద తాజ్ మహల్‌ను పరిరక్షించే యోచనలో భాగంగా సందర్శకులపై నియంత్రణ విధించాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకి గరిష్టంగా 40వేల మందిని మాత్రమే సందర్శనకు అనుమతిస్తూ, ప్రతి టిక్కెట్ మీద మూడు గంటల సందర్శన పరిమితిని కూడా విధించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సాంస్కృతిక శాఖ కార్యదర్శి రవీంద్ర సింగ్, ఏఎస్ఐ అధికారులతో సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది.
దీంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలను 40వేలకు కుదించనున్నారు. తాజ్‌మహల్ సందర్శకుల సంఖ్య ప్రతి ఏడాది 10 నుంచి 15 శాతం పెరుగుతోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సందర్శకుల సంఖ్య రోజుకి 60 వేల నుంచి 70 వేల వరకు ఉంటుంది. మరి వారిపై పరిమితి విధిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న విషయంపై ప్రస్తుతం ఏఎస్ఐ అధ్యయనం చేస్తోంది. ఉచిత దర్శనం అవకాశమున్న 15 ఏళ్ల పిల్లలకు కూడా జీరో వ్యాల్యూ టికెట్లు ఇచ్చి ఎంతమంది సందర్శిస్తున్నారనే విషయాన్ని అంచనా వేసేందుకు ఏఎస్ఐ యోచిస్తోంది.