Vijayawada: దుర్గమ్మ గుడి ప్రధాన అర్చకుడిపై వేటు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-cd095e33656d9b7ec808bbba831cbb0fe4e1d8d0.jpg)
- ఆలయంలో అర్థరాత్రి పూజలు జరిపినట్టు ఆరోపణలు
- తొలుత అటువంటిదేమీ లేదని చెప్పిన ఈఓ
- సీసీటీవీ ఫుటేజ్ బయటపడటంతో చర్యలు మొదలు
- ప్రధానార్చకుడు బదరీనాథ్ కొండ దిగువ ఆలయానికి బదలీ
- దర్యాఫ్తు చేయిస్తున్నామన్న మంత్రి పైడికొండల
గత నెల 26న అర్ధరాత్రి వేళ విజయవాడ కనకదుర్గమ్మ గర్భాలయంలో ప్రత్యేక అర్చనలు చేశారని, అమ్మవారిని మహిషాసుర మర్దనిగా అలంకరణ చేసి, తాంత్రిక పూజలను జరిపించడంతో పాటు, ప్రత్యేక నైవేద్యంగా కదంబాన్ని తయారు చేయించారని వచ్చిన ఆరోపణలపై ఎట్టకేలకు చర్యలు ప్రారంభమయ్యాయి.
తొలుత అటువంటిదేమీ లేదని, గుడిని శుభ్రం చేసేందుకే అనుమతించామని చెప్పిన ఆలయ ఈఓ సూర్యకుమారి, వీడియో ఫుటేజ్ లు బయటకు రావడం, అందులో కొత్త వ్యక్తులు కనిపించడంతో, మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించామని, పూజల సమాచారం తెలిసిన వెంటనే ప్రధాన అర్చకుడు బదరీనాథ్ బాబుపై వేటు వేసి, కొండదిగువున ఉన్న కామధేను అమ్మవారి ఆలయానికి బదిలీ చేశామని వెల్లడించారు. ఆలయంపై వచ్చిన ఆరోపణల మీద దర్యాఫ్తు చేయించి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలియజేశారు.