Tamilnadu: కాంచీపురం ఆలయంలో బంగారు నగల స్థానంలో గిల్ట్ నగలు.. తొమ్మిది మంది అరెస్టు!
- ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురంలో మోసం
- ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు తాకట్టు
- బంగారు నగలదీ అదే పరిస్థితి
- నిందితులపై కేసు నమోదు..అరెస్ట్ చేసిన పోలీసులు
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురంలో జరిగిన మోసం బయటపడింది. ఏకాంబరేశ్వర ఆలయంలోని స్వామి వారికి, అమ్మవారికి బంగారు నగలు బదులు గిల్ట్ నగలు ఉన్న విషయం తాజాగా బయటపడింది. ఈ సంఘటనలో తొమ్మిది మందిపై పోలీసులు ఈరోజు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఏకాంబరేశ్వర ఆలయంలోని స్వామి వారికి, అమ్మ వారికి నగలు చేయించేందుకు ఆలయకమిటీ నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ స్తపతి, ఆలయ మేనేజర్, నగల తయారీదారులకు ఆరు కిలోల బంగారాన్ని అందజేయగా, బంగారు నగలు తయారు చేసి దేవతా విగ్రహాలకు అలంకరించడం జరిగింది. ఇదిలా ఉంచితే, తాజాగా పట్టణంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రెండు పంచలోహ విగ్రహాలు దొరికాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు, ఈ విగ్రహాల విషయమై విచారణ ప్రారంభించగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ విగ్రహాలు ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలోవని పోలీసుల విచారణలో బయటపడింది.
ఆలయంలోని పంచలోహ విగ్రహాలను బయట తాకట్టుపెట్టి, వాటి స్థానంలో నకిలీ విగ్రహాలను ఉంచినట్టు తేలింది. దీంతో పాటు మరో ఆశ్చర్యకర విషయం కూడా వెలుగు చూసింది. ఆలయంలోని బంగారు నగలను తాకట్టుపెట్టి వాటి స్థానే గిల్ట్ నగలను ఉంచినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. స్తపతి, ఆలయ మేనేజర్, నగల తయారీదారు సహా తొమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.