cape town: కేప్‌టౌన్‌లో నీళ్లకరువు... ఇబ్బందులు పడుతున్న అనుష్క-విరాట్?
- ఇతర క్రికెటర్లకు కూడా ఇబ్బందులు
- నీళ్లు తక్కువ వాడాలని నిబంధనలు
- ఆరో స్థాయి నీటి వాడకం హెచ్చరికలు జారీ చేసిన కేప్‌టౌన్ యంత్రాంగం
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్ జట్టు కేప్‌టౌన్ వెళ్లిన సంగతి తెలిసిందే. వీరితో పాటు కొత్త పెళ్లి జంట అనుష్క-విరాట్‌లు కూడా తమ రెండో హనీమూన్ ను అక్కడ జరుపుకుంటున్నారు. అయితే కేప్‌టౌన్‌లో పరిస్థితులు వారికి ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ వేసవికాలం కావడంతో నీళ్లకరువు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నీళ్ల కోసం కేప్‌టౌన్ జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారితో పాటు పర్యాటకులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ నీళ్లకరువు తీవ్రతను తెలియజేయడానికి కేప్‌టౌన్ విమానాశ్రయంలోనే ప్రకటనలు ఇస్తున్నారు. పర్యాటకులు నీళ్లు తక్కువగా వాడాలని ఎక్కడికక్కడ సూచన బోర్డులను ఉంచారు. తాజ్, సదరన్ సన్ వాటర్‌ఫ్రంట్ వంటి ప్రముఖ హోటళ్లు కూడా వీలైనంత మేరకు తక్కువ నీళ్లు వాడాలని చెబుతున్నాయి. నీళ్ల వాడకం గురించి ఇప్పటికే కేప్‌టౌన్ పట్టణ యంత్రాంగం ఆరో స్థాయి హెచ్చరికలను కూడా జారీ చేసింది. దీంతో విరుష్క హనీమూన్ ఆనందాన్ని ఈ నీళ్ల కరువు కబళించినట్లైంది.
పర్యాటక రంగం మీదే ఆర్థికంగా ఆధారపడే కేప్‌టౌన్ జీడీపీకి ఈ నీళ్లకరువు కారణంగా తీవ్ర గండి పడే అవకాశం కన్పిస్తోంది. వీలైనంత మేరకు పర్యాటకులకు నీటి ఇబ్బంది కలగకుండా చేసేందుకు హోటళ్లు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాకుండా... హాట్ టబ్ బాతింగ్, స్పా, రోస్ వాటర్ బాతింగ్ వంటి కేప్‌టౌన్ ప్రఖ్యాత మసాజ్ విధానాలను కూడా ఈ హోటళ్లు నిలిపివేయాల్సి వస్తోంది.