iss: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవులు... కనిపెట్టిన వ్యోమగాములు
- సూక్ష్మజీవులుగా నిర్ధారించిన వ్యోమగాములు
- వాటి నమూనాలను సేకరించిన పెగ్గీ విట్సన్
- డీఎన్ఏ విశ్లేషణ కోసం అక్కడే ప్రయోగాలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవుల ఉనికిని వ్యోమగాములు గుర్తించారు. శూన్యపరిస్థితుల్లో కూడా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయని నిరూపించడానికి ఈ పరిశోధన తోడ్పడనుంది. ఈ సూక్ష్మజీవుల నమూనాలను నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ సేకరించారు. ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో వివిధ ఉపరితలాల మీద గాజుపాత్రను తాకించడం ద్వారా ఆమె సూక్ష్మజీవులను సేకరించారు. తర్వాత భూమ్మీద ఉన్న శాస్త్రవేత్తల సలహాల మేరకు వాటిపై పరిశోధనలు చేశారు.
మిన్అయాన్ అనే పరికరం సాయంతో ఆమె డీఎన్ఏ విశ్లేషణ చేపట్టారు. తర్వాత ఈ విశ్లేషణను, నమూనాలను భూమికి పంపించారు. హ్యూస్టన్‌లోని సూక్ష్మజీవశాస్త్ర పరిశోధకులు వాటిపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. వారి ప్రయోగ ఫలితాలు విట్సన్ ఆవిష్కరణను కచ్చితత్వంతో నిర్ధారించడం గమనార్హం.