Sabbir Rahman: అభిమానిపై దాడి ఫలితం.. భారీ మూల్యం చెల్లించుకున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్.. భవిష్యత్ ప్రశ్నార్థకం!
- డిసెంబరు 21న ఆట జరుగుతుండగా అభిమానిపై దాడి
- అంపైర్ అనుమతి తీసుకుని మరీ స్టాండ్స్‌లోకి వెళ్లిన షబ్బీర్
- ఫిర్యాదు చేసిన రిఫరీపైనా నోరు పారేసుకున్న వైనం
ఫీల్డ్ అంపైర్ అనుమతి తీసుకుని మరీ స్టాండ్స్‌లోకి వెళ్లి అభిమానిపై దాడి చేసిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షబ్బీర్ రహ్మాన్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అతడి చర్యను తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. షబ్బీర్ జాతీయ జట్టు కాంట్రాక్టును రద్దు చేయడంతోపాటు రూ.2 లక్షల బంగ్లాదేశీ టాకాల జరిమానా విధించింది. ఆరు నెలలపాటు దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. అంతేకాదు.. మరోసారి క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే జీవితకాల వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. ఫలితంగా అతడి క్రికెట్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది.
డిసెంబరు 21న రాజ్‌షాహిలో జరిగిన మ్యాచ్‌లో తన స్నేహితుడితో కలిసి వచ్చిన అభిమానిపై స్టేడియంలో షబ్బీర్ చేయిచేసుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న షబ్బీర్ ఫీల్డ్ అంపైర్ అనుమతితో మైదానాన్ని వీడి మరీ అతడిపై దాడి చేశాడు. తనను ఏదో అన్నట్టు భావించిన షబ్బీర్ స్టాండ్స్‌లోకి వెళ్లి మరీ అతడిపై చేయి చేసుకున్నాడు. దీనిని ప్రత్యక్షంగా గమనించిన రిఫరీ బీసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రిఫరీపైనా అతడు నోరు పారేసుకున్నాడు.
సోమవారం భేటీ అయిన క్రమశిక్షణ సంఘం తీవ్ర చర్యలకు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ రిఫరీ రిపోర్టు ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్టు బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపారు. గతంలోనూ అతడు పలుమార్లు క్రమశిక్షణను ఉల్లంఘించాడని పేర్కొన్న ఆయన షబ్బీర్ వైఖరిలో మార్పు రాకుంటే జీవిత కాల నిషేధం తప్పదని హెచ్చరించారు. కాగా, చేసిన తప్పుకు షబ్బీర్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పటికీ బీసీబీ అధికారులను ఒప్పించడంలో విఫలమయ్యాడు.