Chandrababu: రాజకీయ లబ్ధి కోసం కొందరు కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు

  • దూరదృష్టి నిర్ణయాలతో సమస్యలను అధిగమించగలిగాం
  • ప్రజల కోసం ఎన్నో చేస్తున్నాం
  • ఐదో విడత జన్మభూమి వినూత్నంగా నిర్వహిస్తాం

2017లో అన్ని రంగాల్లో  ప్రగతి సాధించామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల సమస్యలను అధిగమించగలిగామని చెప్పారు. శ్రీకాకుళంలో వంశధార ప్రాజెక్ట్ కు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, ఒక్కో సమస్యను జాగ్రత్తగా అధిగమిస్తున్నామని, ప్రజల కోసం ఎన్నో చేస్తున్నామని అన్నారు. అయినప్పటికీ, ఎక్కడో ఒక చోట రాజకీయంగా ఇబ్బంది పెట్టేవారు ఉంటున్నారని, వేలాది మంది ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

కాగా, రేపటి నుంచి ఐదో విడత జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నట్టు చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఐదో విడత ‘జన్మభూమి’ని ప్రారంభిస్తానని, ఒక్కో జిల్లాలో ఒక్కోరోజు పాల్గొంటానని పేర్కొన్న చంద్రబాబు, ఈసారి నిర్వహించనున్న‘జన్మభూమి’ వినూత్నంగా నిర్వహించనున్నామని, పదిరోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో రోజుకో అంశంపై చర్చ జరుగుతుందని తెలిపారు.‘జలసిరి’కి హారతి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చామని, రూ.250 కోట్ల మేర విద్యుత్ పొదుపు చేశామని, భవిష్యత్ లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఏకైక ప్రభుత్వం తమదేనని చంద్రబాబు గర్వంగా చెప్పారు.  

సమాజంలో అశాంతి మంచిది కాదని, అందరూ కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. రాజకీయ లబ్ధి కోసం కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారని, విగ్రహాలు ధ్వంసం చేసి ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి కుట్రలను ప్రజలు విజ్ఞతతో తిప్పి కొట్టాలని చంద్రబాబు సూచించడం గమనార్హం.

  • Loading...

More Telugu News