dalit: కర్నూలు జిల్లాలో ఎస్సీలు ఉండే కాలనీకి తాగునీరు కట్.. దళితులతో మాట్లాడితే రూ.5 వేలు జరిమానా!
- కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామంలో ఘటన
- ఖననానికి గొయ్యి తవ్వలేదని వెలివేత
- పోలీసులను ఆశ్రయించిన దళితులు
కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామ ప్రజలు దళితులను బహిష్కరించారు. ఎస్సీ కాలనీకి తాగునీరు అందించే పైప్‌లైన్‌ను పగులకొట్టి నీళ్లు అందకుండా చేశారు. అంతేకాదు దళితులతో ఎవరైనా మాట్లాడితే రూ.5 వేలు జరిమానా వేస్తామన్నారు. వాళ్లకు నిత్యావసర సరుకులు అమ్మితే కూడా షాపు యజమానులకు రూ.5 వేలు జరిమానా విధిస్తామని తేల్చి చెప్పారు. దీంతో దళితులు పోలీసులను ఆశ్రయించారు. తమ గ్రామంలో బాల తిమ్మయ్య (90) అనే ఓ వృద్ధుడు చనిపోతే ఖననానికి గొయ్యి తవ్వలేదన్న కక్షతో తమకు ఈ శిక్ష విధించారని దళితులు తెలిపారు.
గొయ్యి తవ్వేవారు ఇద్దరే ఉండడంతో గుంత తవ్వలేమని ఇద్దరు వ్యక్తులు బాల తిమ్మయ్య (90) కుటుంబ సభ్యులకు చెప్పారని, దీంతో తమను బహిష్కరించారని, పర్యవసానంగా సుమారు 20 కుటుంబాలకు నీళ్లు, సరుకులు అందక బాధపడుతున్నారని దళితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.