atm charges: ఏటీఎం చార్జీలకు రెక్కలు రానున్నాయా...? ఇంటర్ చేంజ్ ఫీజు పెంచాలంటూ డిమాండ్లు!

  • చార్జీలు పెంచాలని ప్రైవేటు బ్యాంకుల ఒత్తిడి
  • వ్యతిరేకిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులు
  • ఖాతాదారుడు మరో బ్యాంకు ఏటీఎం వాడితే చెల్లించే చార్జీ ఇది

ఏటీఎం లావాదేవీలపై ఇంటర్ చేంజ్ ఫీజు పెంచాలంటూ బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంకు ముందుకు డిమాండ్లు వస్తున్నాయి. వ్యయాలు పెరగడం, డీమోనిటైజేషన్ ప్రభావం, లావాదేవీల సంఖ్య పడిపోవడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ఇంటర్ చేంజ్ ఫీజు అంటే, ఒక బ్యాంకు కస్టమర్ ఇంకో బ్యాంకు ఏటీఎం వినియోగించుకున్నప్పుడు చెల్లించాల్సిన చార్జీ.

డీమోనిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య కొంత మేర తగ్గింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంల్లో అన్ని వేళలా నగదు లభ్యం కాని పరిస్థితి. దీంతో ఆయా బ్యాంకుల కస్టమర్లు నగదు ఉన్న ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించుకుంటున్నారు. దీంతో వినియోగించుకున్న బ్యాంకు నెట్ వర్క్ కు, ఆ ఖాతాదారుడి మాతృ బ్యాంకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల కస్టమర్లు ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలను ఎక్కువగా వినియోగించుకున్నారు. దీంతో ఇంటర్ చేంజ్ చార్జీలు పెంచాలంటూ ప్రైవేటు బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వరంగంలోని పెద్ద బ్యాంకులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. చార్జీలు పెరిగితే తమపై పడే భారం అధికమవుతుందని ఓ ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు డైరెక్టర్ ఒకరు తెలిపారు. సాధారణంగా బ్యాంకులు తమపై పడే భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News