Tirumala: చంద్రబాబు సర్కారు చెప్పినా ఖాతరు చేయని ప్రజలు, అధికారులు... దేవాలయాలు కిటకిట!
- న్యూ ఇయర్ నాడు ఆలయాలకు పోటెత్తిన భక్తులు
- తిరుమలలో దర్శనానికి 10 గంటల సమయం
- విజయవాడ, శ్రీశైలం, అన్నవరంలోనూ అదే పరిస్థితి
- యాదాద్రి, బాసర, వేములవాడలో సైతం
జనవరి 1 నూతన సంవత్సరం ఆంగ్ల సంప్రదాయమని, తెలుగు ప్రజలుగా ఉగాదినే కొత్త సంవత్సరంగా పరిగణించాలని, జనవరి 1న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకరణలు వద్దని చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, ప్రజలు, అధికారులు పట్టించుకోలేదు. ఈ ఉదయం దేవాలయాలన్నీ కిటకిటలాడుతూ కనిపించాయి. తిరుమలలో దర్శనానికి 10 గంటలకు పైగానే వేచి ఉండాల్సిన పరిస్థితి. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కనీసం మూడు నుంచి నాలుగు గంటలు క్యూలైన్లో నిలబడితేనే అమ్మ దర్శనం కలుగుతోంది.
ఇక శ్రీశైల మల్లన్న, అన్నవరం సత్యనారాయణస్వామి, శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇక పలు పట్టణాలు, గ్రామాల్లోని ఆలయాల్లో సైతం ఇదే పరిస్థితి. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలను కూడా చేశారు. ఏపీ దేవాదాయ శాఖ పంపించిన ఆదేశాలకు, వివిధ ఆలయాల ఈఓలు ఏ మాత్రం స్పందించలేదని, ప్రతి సంవత్సరమూ జరిగేలాగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.
ఇక తెలంగాణలోనూ ఆలయాలు పోటెత్తాయి. నరసింహుని దర్శనానికి ఐదు గంటలు పడుతుంటే, రాజరాజేశ్వరి అమ్మవారిని చూసేందుకు 3 గంటలు నిలబడాల్సిన పరిస్థితి. బాసర, భద్రాచలం, చిలుకూరు వంటి దేవాలయాల్లో సైతం భక్తుల తాకిడి అధికంగా కనిపిస్తోంది.