Vijayawada: ఫోన్ కాల్ వస్తే మాట్లాడిన కుమార్తెను... 'ఎవడు ఫోన్ చేశాడు?' అంటూ కొట్టి చంపిన నాన్న!

  • తండ్రికి వచ్చిన ఫోన్ ను లిఫ్ట్ చేసిన కుమార్తె
  • అనుమానంతో హత్య చేసిన తండ్రి
  • విజయవాడలో కలకలం

రాంగ్ కాల్ మాట్లాడి, రాంగ్ నంబరంటూ ఫోన్ పెట్టేసిన కుమార్తె, తనకు తెలియకుండానే ఎవరితోనో మాట్లాడిందన్న అనుమానంతో, ఓ తండ్రి తన కడుపున పుట్టిన బిడ్డను కొట్టి చంపాడు. ఈ ఘటన విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, నగరంలో నివసించే ఆటో డ్రైవర్ రమణ కుమార్తె కృష్ణవేణి (15) టెన్త్ చదువుతోంది. ఎప్పుడూ క్లాసులో తొలి స్థానంలోనే ఉండేది. శనివారం నాడు ఆమె తండ్రి ఫోన్ రింగ్ కాగా, కృష్ణవేణి లిఫ్ట్ చేసింది. అవతలి వైపు నుంచి మాటలు వినిపించక పోవడంతో 'హలో, హలో' అని ఫోన్ పెట్టేసింది. అప్పుడే రమణకు అనుమానం పెరిగింది. ఎవరు ఫోన్ చేశారని నిలదీశాడు. ఎవరో రాంగ్ కాల్ చేశాడని చెప్పడంతో, అనుమానంతో కుమార్తెను చావబాదాడు. అడ్డు వచ్చిన తల్లిని కూడా కొట్టాడు.

కాసేపటి తరువాత మందు కొట్టి వచ్చి మరోసారి వారిపై రెచ్చిపోయాడు. రమణ దెబ్బలకు తట్టుకోలేక కృష్ణవేణి మరణించింది. గుట్టుచప్పుడు కాకుండా అమ్మాయి అంత్యక్రియలు చేయాలని భావించిన రమణ, డ్రామా చేసి, కడుపు నొప్పితో తన కూతురు మరణించిందని ఇరుగు, పొరుగుకు చెప్పాడు. ఇంతలో పోలీసులకు ఎవరో సమాచారం అందించడంతో, వారు వచ్చి తమదైన శైలిలో విచారించడంతో నిజం కక్కాడు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మొత్తం విషయాన్ని బయట పెడతామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Vijayawada
Wrong call
Murder
  • Loading...

More Telugu News