kochi metro rail: మా వల్లే వీరి పెళ్లి సమయానికి జరిగింది!: వధూవరుల వీడియోను పోస్ట్ చేసిన కొచ్చి మెట్రో రైల్ సిబ్బంది
- కేరళలోని ఎర్నాకుళంలో ఘటన
- గంటల కొద్దీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వరుడి కుటుంబం
- చివరకు మెట్రోస్టేషన్‌కు వెళితే అక్కడ కూడా రద్దీ
- టిక్కెట్లు ఇచ్చి పంపిన మెట్రో అధికారులు
తమ వల్లే ఓ జంట పెళ్లి ఎలాంటి అడ్డంకులూ లేకుండా జరిగిందని పేర్కొంటూ కొచ్చి మెట్రోరైల్ సిబ్బంది తాజాగా తమ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అలాగే తాము ఆ జంటకి పెళ్లి గిఫ్ట్ గా ‘కోచి వన్’ కార్డు ఇచ్చామని, ఆ కార్డుతో మెట్రో రైలులో ప్రత్యేక ప్రవేశం ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే, కేరళలోని పాలక్కడ్‌కు చెందిన రంజిత్‌కుమార్‌తో అదే రాష్ట్రంలోని ఎర్నాకుళంలోని ధన్య అనే యువతికి పెద్దలు వివాహ ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి పందిరంతా బంధుమిత్రులతో కోలాహలంగా ఉంది.
అయితే, పెళ్లి ముహూర్తం దాటిపోయినప్పటికీ పెళ్లి కొడుకు అక్కడికి చేరుకోలేదు. దీంతో అందరూ కంగారు పడ్డారు. పెళ్లి మండపానికి వస్తోన్న వరుడి కుటుంబం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిందని పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో వారి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అయితే, కొన్ని గంటలు గడిచినా వరుడి కుటుంబం ట్రాఫిక్‌లోనే ఉండిపోయింది. దీంతో కొందరు ఇచ్చిన సలహాతో మెట్రో రైల్‌లో వెళదామని వరుడి కుటుంబం కారు నుంచి దిగి మెట్రోస్టేషన్‌కి వెళ్లింది.
అయితే, అక్కడ కూడా వారికి షాక్ తగిలింది. మెట్రోస్టేషన్ చాలా రద్దీగా ఉండడంతో మెట్రో రైల్ టిక్కెట్ దొరుకుతుందో లేదోనని వరుడి కుటుంబం కంగారు పడింది. అధికారుల వద్దకు వెళ్లి ఈ రోజు పెళ్లి ఉందని, టిక్కెట్లు ఇవ్వాలని కోరింది. దీంతో వారు టికెట్లు ఇవ్వడంతో పెళ్లి కొడుకు కుటుంబం ఊపిరి పీల్చుకుంది. మెట్రో రైల్లో ప్రయాణించి ఆ పెళ్లికొడుకు వివాహం చేసుకున్నాడు.