P.V.Sindhu: సింధును చూసైనా కోహ్లీ నేర్చుకోవాలి.. బిషన్ సింగ్ బేడీ సలహా
- సింధుపై ప్రశంసలు కురిపించిన మాజీ స్పిన్ దిగ్గజం
- టీమిండియాకు దక్షిణాఫ్రికా టూర్ సవాలేనన్న బేడీ
- విదేశీ గడ్డపై రాణించడం ఆషామాషీ కాదని వ్యాఖ్య
బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధును చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేర్చుకోవాల్సింది చాలా ఉందని భారత మాజీ స్పిన్సర్ బిషన్ సింగ్ బేడీ అన్నారు. సింధు చాలా తక్కువ సమయంలోనే అద్భుత ప్రదర్శనతో అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించిన బేడీ.. ఆమెలాగే కోహ్లీ కూడా విజయాలు సాధించేందుకు ఇంకా కష్టపడాలని అన్నారు.
ఢిల్లీలో ఓ క్రీడా సంచిక కార్యక్రమంలో పాల్గొన్న బేడీ మాట్లాడుతూ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న కోహ్లీ సేనకు దక్షిణాఫ్రికా పర్యటన అతి పెద్ద సవాలు కానుందన్నారు. విదేశీ గడ్డపై రాణించడం ఆషామాషీ కాదన్నారు. వరుసగా తొమ్మిది టెస్ట్ సిరీస్‌లు నెగ్గి జోరుమీదున్నప్పటికీ దక్షిణాఫ్రికా వంటి దేశాలతో తలపడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందన్నారు. నిజానికి ఇదో పెద్ద పరీక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు.