emirates: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పనితీరుపై క్రికెటర్ అసంతృప్తి!
- దుబాయ్‌లోనే ఆగిపోయిన శిఖర్ ధావన్ కుటుంబం
- ట్వీట్లలో అసంతృప్తి వ్యక్తం చేసిన శిఖర్
- జన్మధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా ఆగిపోయిన భార్యాపిల్లలు
దక్షిణాఫ్రికాలో 56 రోజుల పర్యటనకు భారత జట్టు ఆటగాళ్లు కుటుంబాలతో సహా పయనమైన సంగతి తెలిసిందే. అయితే వారిలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ కుటుంబం మాత్రం దుబాయ్‌లోనే ఉండిపోయింది. దీంతో శిఖర్ ఒక్కడే కేప్‌టౌన్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ దిగిన వెంటనే తన కుటుంబం దుబాయ్‌లోనే ఆగిపోవడానికి కారణమైన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ మీద శిఖర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు ట్వీట్లు చేశారు.
'ఇది కచ్చితంగా అమర్యాదకరం. నేను కుటుంబంతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్తున్నాను. కానీ దుబాయ్‌లో నా భార్యాపిల్లలను ఎమిరేట్స్ సిబ్బంది ఆపేశారు. వారి జన్మధ్రువీకరణ పత్రాలు చూపించాలని అడిగారు. అవి మా దగ్గర లేవు. దీంతో పత్రాలు వచ్చేవరకు వారు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాల్సి వస్తోంది. మేం ముంబైలో విమానం ఎక్కేటప్పుడే ఇలాంటి నిబంధనల గురించి మీరు ఎందుకు చెప్పరు? అలాగే మీ ఎమిరేట్స్ ఉద్యోగి ఒకరు చాలా అమర్యాదగా ప్రవర్తించాడు' అని శిఖర్ ధావన్ ట్వీట్ చేశారు.