twitter: ట్విట్టర్‌లో కాంగ్రెస్ ఎంపీని బ్లాక్ చేసిన సుష్మా స్వరాజ్!
- అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా
- 'విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలాగేనా పనిచేసేది' అంటూ మండిపాటు
- పదేపదే ఇరాక్‌లో తప్పిపోయిన భారతీయుల గురించి అడిగిన ఎంపీ
ఇరాక్‌లో తప్పిపోయిన 39 మంది భారతీయుల గురించి మాటిమాటికి అడుగుతున్న కారణంగా ట్విట్టర్‌లో కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా ఖాతాను, విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ బ్లాక్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ప్రతాప్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలాగేనా పని చేసేది? తప్పిపోయిన భారతీయుల గురించి అడిగినందుకు ఒక పార్లమెంటు సభ్యుడిని ఇలా బ్లాక్ చేస్తారా?' అంటూ ప్రతాప్ మండిపడ్డారు.
వీరిద్దరి మధ్య వైరం జులైలో ప్రారంభమైంది. ఇరాక్‌లో 39 మంది భారతీయులు తప్పిపోయారని సుష్మా స్వరాజ్ లోక్‌సభలో ప్రకటించగానే ప్రతాప్ బజ్వా ఆమె వ్యాఖ్యలను ఖండించారు. తప్పిపోయినవారి ఆచూకీ గురించి చెప్పడంలో సుష్మా వాస్తవాలు చెప్పడం లేదని విమర్శలు చేశారు. ఇక అప్పటినుంచి వీలు చిక్కినప్పుడల్లా ఆయన ట్విట్టర్‌లో ఆ భారతీయుల గురించి అడుగుతూనే ఉన్నారు.