palaniswamy: దినకరన్ కు మద్దతు పలికిన 46 మందిపై వేటు వేసిన పళనిస్వామి!
- దినకరన్ కు మద్దతుగా నిలిచిన వారిపై వేటు
- ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు
- వేటు పడినవారిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు
శశికళ మేనల్లుడు దినకరన్ కు మద్దతుగా నిలిచారనే ఆరోపణలతో 46 మందిపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వేటు వేశారు. వీరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీ పదవులతో పాటు, అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వేటు పడిన వారిలో ధర్మపురి, తిరుచిరాపల్లి, పెరంబులూరు, విల్లుపురం, మధురై జిల్లాలకు చెందిన నాయకులు ఉన్నారు.
మరోవైపు, అపోలో ఆసుపత్రిలో దివంగత జయలలితకు అందించిన చికిత్సకు సంబంధించిన ఆధారాలను అందజేయాలంటూ ఈ నెల 22న ఈమెయిల్ ద్వారా శశికళకు సమన్లు వచ్చాయి. జయ మరణంపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ జడ్జి జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ ఈ సమన్లను జారీ చేసింది. సమన్లు వచ్చిన విషయాన్ని జైలు అధికారులు శశికళకు తెలిపారు. ఈమెయిల్ ద్వారా వచ్చిన సమన్లను తీసుకోవడానికి శశికళ నిరాకరించారు. నేరుగా వచ్చి సమన్లను అందజేస్తేనే తాను తీసుకుంటానని ఆమె చెప్పినట్టు జైలు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ మెయిల్ ద్వారా శశికళకు సమన్లు పంపలేదని కమిషన్ ప్రకటించంది.