Katti Mahesh: కలకలం రేపుతున్న కత్తి మహేష్ పోస్టు... తీవ్రంగా మండిపడ్డ బుద్ధా వెంకన్న!

  • ఏపీకి చేవగల ఎంపీలు కావాలంటూ కత్తి మహేష్ పోస్ట్ 
  • తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్న బుద్దా వెంకన్న
  • బాధ్యత లేనట్టుగా ప్రవర్తించవద్దని హితవు

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేవగల ఎంపీలు కావలెను' అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండగా, తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. మహేష్ ఉద్దేశం ఏంటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ ఎంపీలు ఉన్నారని, వారంతా పోరాడే శక్తిలేని వారని చెప్పడం ప్రజాభిప్రాయాన్ని అవమానించినట్టేనని నిప్పులు చెరిగారు.

గొడవలు చేస్తేనే పోరాట యోధులని చెప్పడం చాలా తప్పని, వెంటనే మహేష్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని పార్లమెంట్ సభ్యులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జేసీ దివాకర్ రెడ్డి వంటి ఆరుసార్లు గెలిచిన సమర్థవంతులైన ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని, ఆ చేవ, సత్తా లేకుండానే వారు అన్నిసార్లు గెలిచారన్నది మహేష్ అభిప్రాయమా? అని నిప్పులు చెరిగారు.

చాలా అనుభవంగల నాయకులు ఎంతో మంది ఉన్నారని, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, న్యాయం ఎలా సాధించాలన్న విషయమై ఆలోచిస్తున్నామే తప్ప శక్తి లేక, చేవ చచ్చి కాదని అన్నారు. సమాజంలో బాధ్యత లేనట్టుగా ప్రవర్తించ వద్దని హితవు పలికారు. నిజాయతీ, సామర్థ్యంలతో, రాష్ట్రానికి ఎప్పటినుంచో సేవ చేస్తున్న వారిని అవమానించడం తగదని చెప్పారు.

కాగా, అధికార పార్టీని, పవన్ కల్యాణ్ ను విమర్శించడం ద్వారా పాప్యులారిటీని పెంచుకోవాలని కత్తి మహేష్ చూస్తున్నారని, ఇలాంటి కామెంట్లు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని పలువురు టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News