Mumbai: ముంబైలో అర్ధరాత్రి పెను విషాదం.. కమలా మిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 15 మంది సజీవ దహనం!

  • రెస్టారెంట్‌లో చెలరేగి కాంపౌండ్ మొత్తం వ్యాపించిన మంటలు
  • రెస్టారెంట్లు, పబ్‌లు, కార్యాలయాలు బుగ్గి
  • మృతుల్లో 12 మంది మహిళలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో  ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లోని పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో 15 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 12 మంది  మహిళలు ఉన్నారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కేఈఎం ఆసుపత్రికి తరలించారు.

రాత్రి 12.27 గంటలకు ప్రమాద స్థలం నుంచి తమకు తొలి ఫోన్ కాల్ వచ్చినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే 8 శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు పేర్కొన్నారు. కమలా ట్రేడ్ హౌస్‌లోని రెస్టారెంట్‌ 1లో తొలుత మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. తర్వాత అవి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించినట్టు వివరించారు.

ఇదే కాంపౌండ్‌లో పలు మీడియా హౌస్‌లు కూడా ఉన్నాయి. దీంతో దీనిని ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్టులు మాట్లాడుతూ రెస్టారెంట్‌లో  చెలరేగిన మంటలు వేగంగా విస్తరించాయని, దానికి ఆనుకుని ఉన్న డిన్నర్ కమ్ పబ్‌లకు వ్యాపించాయని తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే న్యూస్ చానళ్లు ముందు జాగ్రత్త చర్యగా తమ కార్యాలయాలను మూసేశాయి. ప్రమాదంలో చానళ్లకు సంబంధించిన కొంత సామగ్రి కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News