china: చైనా ప్రాజెక్ట్ తరువాత ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఇదే!: గాలి ముద్దుకృష్ణమ నాయుడు

  • త్వరగా పూర్తి చేయడానికి చంద్రబాబు కృషి
  • దేశంలో అతిపెద్ద బహుళార్థసాధక ప్రాజెక్ట్ పోలవరం
  • భూ సేకరణ వ్యయం పెరిగిపోవడంతో ప్రాజెక్ట్ వ్యయం విపరీతంగా పెరిగింది
  • గతంలో ఎకరానికి రూ.1.50 లక్షలు.. ఇప్పుడు రూ.10.64 లక్షలు

దేశంలో అతిపెద్ద బహుళార్థసాధక ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అని, దీనిని త్వరగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోన్న కృషి అభినందనీయమని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొనియాడారు. శాసనసభ భవన సముదాయంలోని కమిటీ హాల్ లో ఈ రోజు ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కమిటీ సభ్యుల సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు.

చైనా ప్రాజక్ట్ తరువాత ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఇదేన‌ని గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం చంద్ర‌బాబు... ప్రధాన మంత్రి మోదీని, కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి, దానిని త్వరగా పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. భూ సేకరణ వ్యయం పెరిగిపోవడంతో పాటు ప్రాజెక్ట్ వ్యయం కూడా విపరీతంగా పెరిగిందన్నారు. గతంలో ఎకరానికి రూ.1.50 లక్షల రూపాయలు ఇవ్వగా, ఇప్పుడు రూ.10.64 లక్షల వరకు ఇస్తున్నట్లు తెలిపారు.

పట్టిసీమ నిర్మాణం వల్ల 110 టీఎంసీల నీటిని తెచ్చుకోగలిగామన్నారు. కృష్ణా జిల్లాలో మూడు పంటలకు నీరిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పంపులు వృథా కావని, ఆ తరువాత వాటిని మరోచోట అమర్చుకోవచ్చన్నారు. పోలవరం బాధితులకు చక్కటి ఇళ్లు కట్టిస్తున్నట్లు చెప్పారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, డ్రైనేజీ, త్రాగునీరు మొదలైన సకల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఇంట్లో పెళ్లైన వారు ఉంటే వారికి కూడా వేరే ఇల్లు ఇస్తున్నట్లు చెప్పారు. రేపు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించనున్నట్లు తెలిపారు.

జలవనరుల శాఖ ఇంజనీర్లు, సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారు..

కౌన్సిల్ లో ప్రభుత్వం మొత్తం 24 హామీలు ఇచ్చిందని, వాటన్నిటిపై శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నీటి ప్రాజెక్టులపై అధికారులతో చర్చించినట్లు చెప్పారు. వాటిలో ఐదు హామీలు నెరవేర్చారని, మిగిలినవి పెద్ద ప్రాజెక్టులని, వాటి నిర్మాణాలు కొనసాగుతున్నాయని వివరించారు. గత మూడేళ్ల నుంచి జలవనరుల ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నట్లు తెలిపారు. జలవనరుల శాఖ ఇంజనీర్లు, సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు.


దేశానికే తలమానికం 

బకింగ్ హామ్ కెనాల్ కాకినాడ నుంచి చెన్నై వరకు 560 కిలోమీటర్ల జలరవాణాకు సంబంధించి చేపట్టిన బకింగ్ హామ్ కెనాల్ ప్రాజెక్ట్ దేశానికే తలమానికం అని ముద్దు కృష్ణమనాయుడు చెప్పారు. దీనికి రూ.9,465 కోట్లు వ్యయం అవుతుందని, వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.3 వేల కోట్ల వరకు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, తమిళనాడు ప్రభుత్వం ఆమోదం తెలుపవలసి ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులకు అనుసంధానం ఏర్పడుతుందని, జలరవాణా పెరిగి రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు.

ప‌నులు చురుకుగా...
రాయలసీమలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ ప్రాజెక్టుల పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు. హంద్రీ-నీవాను పుట్టపర్తి, ఆ తరువాత మదనపల్లి వరకు పొడిగించమని చెప్పామన్నారు. ఆ పనులు పూర్తి అయితే తరువాత కుప్పం వరకు కూడా నీరు వెళుతుందన్నారు. గాలేరు-నగరి మార్గంలో టర్నల్ కు కేంద్రం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఎస్ఎస్ కెనాల్ ను సామర్థ్యాన్ని పెంచాలని కోరినట్లు తెలిపారు. కాలువలను ఆధునికీకరించుకోవలసి అవసరం ఉందని, సిమెంట్ నిర్మాణం చేపడితే తప్ప నీరు పారదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.    

  • Loading...

More Telugu News