ban on display of non-veg: మాంసాహార విక్రయశాలల్లో చికెన్ టిక్కా, కబాబ్ ల బహిరంగ ప్రదర్శన నిషేధం!: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం
- మాంసాహార బహిరంగ ప్రదర్శనపై నిషేధం
- పరిశుభ్రతే ముఖ్యం
- కొందరి సెంటిమెంట్స్ కూడా దెబ్బతింటున్నాయి
నోరూరించే చికెన్ టిక్కా, కబాబ్ లను ఇకపై ఢిల్లీవాసులు బహిరంగంగా చూడలేకపోవచ్చు. మాంసాహారాన్ని బహిరంగంగా ప్రదర్శించరాదంటూ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణం. మాంసాహార ప్రదర్శనపై ఎస్డీఎంసీ నిషేధం విధించింది. ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉండాలనేదే తమ అభిమతమని ఎస్డీఎంసీ తెలిపింది. దీనికి తోడు మాంసాహార పదార్థాలు బహిరంగంగా కనపడటం వల్ల కొందరి సెంటిమెంట్స్ దెబ్బతింటున్నాయని పేర్కొంది.
పచ్చిమాంసమే కాకుండా, తయారు చేయబడిన ఆహార పదార్థాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని ఎస్డీఎంసీ అధికార ప్రతినిధి తెలిపారు. వాస్తవానికి నజఫ్ గర్ జోన్ లోని కక్రోలా గ్రామ పరిధిలో జరిగిన హెల్త్ కమిటీ మీటింగ్ లో స్థానిక కౌన్సిలర్ ఈ ప్రైవేట్ మెంబర్ రిజొల్యూషన్ ను పెట్టారని... అక్కడి నుంచి అది మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చిందని, ఇక్కడ దాన్ని ఆమోదించడం జరిగిందని ఆయన చెప్పారు. ఇది ప్రైవేట్ మెంబర్ రిజొల్యూషన్ కావడంతో, ప్రతిపాదనను కమిషనర్ కు పంపించామని... ఢిల్లీ మున్సిపల్ చట్టం కింద ఆయన ఈ ప్రతిపాదనను ఆమోదించడం లేదా తిరస్కరించడం జరుగుతుందని అధికార ప్రతినిధి తెలిపారు.
మరోవైపు ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ నిర్ణయం ప్రజల జీవితాలలో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది. ఈ ప్రతిపాదనను తాము వ్యతిరేకించినప్పటికీ బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తాము అడ్డుకోలేకపోయామని తెలిపింది.