electricity: 2019 మార్చి నాటికి 24 గంటల విద్యుత్... లేకుంటే విద్యుత్ సంస్థలపై పెనాల్టీలు: కేంద్ర మంత్రి ఆర్కే సింగ్
- అన్ని ఇళ్లకూ 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్
- లేకుంటే డిస్కంలపై పెనాల్టీలు
- విద్యుత్ సదుపాయాలకు రూ.1,75,000 కోట్ల ఖర్చు
2019 మార్చి నాటికి దేశవ్యాప్తంగా అన్ని ఇళ్లకూ 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ అందిస్తామని కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. 2018 డిసెంబర్ నాటికి విద్యుత్ సౌకర్యం లేని 1,694 గ్రామాలకు దాన్ని సాధ్యం చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలిపారు.
లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఈ వివరాలు తెలియజేశారు. 2019 మార్చి తర్వాత ఎటువంటి విఘాతం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైతే డిస్కంలపై పెనాల్టీలు విధించేందుకు చట్టాన్ని అమలు చేయనున్నట్టు సింగ్ చెప్పారు. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను ప్రస్తుతమున్న 21 శాతం నుంచి 2019 జనవరి నాటికి 15 శాతానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు గాను రూ.1,75,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.