ap high court: ఉమ్మడి హైకోర్టు విభజనపై పార్లమెంటులో ప్రకటన చేసిన మంత్రి రవిశంకర్ ప్రసాద్
- హైకోర్టు విభజన అంశాన్ని మరోసారి లేవనెత్తిన టీఆర్ఎస్
- ఆ పనిని సుప్రీంకోర్టు చూసుకుంటుందన్న రవిశంకర్ ప్రసాద్
- త్వరలోనే ఇరు రాష్ట్రాలతో సమావేశమవుతామన్న రాజ్ నాథ్
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు కూడా పార్లమెంటులో పట్టుబట్టారు. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు జడ్జిల నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా లోక్ సభలో వాగ్వాదం చోటు చేసుకుంది.
అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ అంశంపై ప్రకటన చేశారు. అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. విభజన చట్టం ప్రకారం హైకోర్టును విభజించాల్సి ఉందని అన్నారు. అయితే, హైకోర్టు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని... సుప్రీంకోర్టు కొలీజియం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జడ్జీల విభజన అంశాన్ని హైకోర్టు కొలీజియం పరిశీలిస్తుందని చెప్పారు.
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, విభజన సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఇరు రాష్ట్రాలతో సమావేశమవుతామని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని అంశాలపై చర్చిస్తామని చెప్పారు. హైకోర్టు అంశం మాత్రం సుప్రీంకోర్టు చూసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీల వాదనపై టీడీపీ ఎంపీ సుజనాచౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్క హైకోర్టే కాకుండా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. అన్ని సమస్యలను కలిపి ఒక్కసారే పరిష్కరించాలని కోరారు.