Lalu Prasad Yadav: తిన్నన్ని తినుబండారాలు... కావలసినప్పుడల్లా పానీయాలు: జైల్లో లాలూ రాజభోగాలు!
- ప్రస్తుతం రాంచీ జైల్లో వీఐపీ ఖైదీగా లాలూ ప్రసాద్ యాదవ్
- సహచర ఖైదీలంతా మాజీ ప్రజా ప్రతినిధులే
- అడిగిన వెంటనే బాస్మతీ బియ్యం అన్నం, పప్పు, స్వీట్స్
- సంకట మోచన్ దేవాలయం ప్రసాదం కూడా!
దాణా కుంభకోణం కేసులో దోషిగా నిరూపితుడై, శిక్ష కోసం వేచి చూస్తూ, ప్రస్తుతం రాంచీలోని హాత్వార్ జైల్లో వీఐపీ ఖైదీగా కాలం గడుపుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ సకల భోగాలనూ అనుభవిస్తున్నారని సమాచారం. జార్ఖండ్ కేంద్రంగా వెలువడుతున్న 'ప్రభాత ఖబర్' పత్రిక ప్రచురించిన సంచలన కథనం ప్రకారం, ఆయన ఓ ఖైదీగాకన్నా వీఐపీగానే జైల్లో ట్రీట్ చేయబడుతున్నారట. జైల్లోని పై అంతస్తులో ఉన్న గదిలో ఆయన ఇతర రాజకీయ నాయకులతో కలసి ఉంటున్నారని, కావాల్సినప్పుడల్లా ఆయనకు తినుబండారాలు, కాఫీ తదితర పానీయాలు సమకూరుతున్నాయని తెలుస్తోంది.
పొద్దున్నే దినపత్రిక చదవడంతో రోజును ప్రారంభించే ఆయన, వాటిల్లోని అంశాలను తోటి రాజకీయ ఖైదీలతో సమగ్రంగా చర్చిస్తున్నారట. ఆపై బీహార్, జార్ఖండ్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ, కాసేపు విశ్రాంతి తీసుకుంటూ, మరికాసేపు టీవీ చూస్తూ ఉన్నారని పత్రిక పేర్కొంది. లాలూతో పాటు మాజీ ఎంపీలు ఆర్కే రానా, జగదీశ్ శర్మ, స్వాన లక్రాలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు రాజా పీటర్, కమల్ కిశోర్ భగత్ లు కూడా అదే గదిలో ఉన్నారని జైలు అధికారులు తెలిపారు.
ఇక తనకు ఇష్టమైన మొక్కజొన్న, పచ్చి బఠానీ, వంకాయ కూర, తోటకూర, బాస్మతీ బియ్యంతో వండిన అన్నం, పప్పు, సంకట మోచన్ దేవాలయం నుంచి ప్రసాదం నిత్యమూ లాలూ కోసం వస్తున్నాయని సదరు పత్రిక వెల్లడించింది. కాగా, జనవరి 3న లాలూకు ఈ కేసులో శిక్ష ఏమిటన్నది వెలువడనున్న సంగతి తెలిసిందే.