Nara Lokesh: ఫైబర్ కేబుల్ కట్ చేసిన ఘటనపై మంత్రి లోకేశ్ మండిపాటు!

  • రాష్ట్రపతి పర్యటన కార్యక్రమం ప్రసారం కాకుండా ఫైబర్ కేబుల్ కట్
  • తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న సంఘటన
  • సమగ్ర దర్యాప్తు జరపాలని కలెక్టర్ కి ఆదేశాలు

అమరావతిలో ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ ను రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రపతి పర్యటన కార్యక్రమం ప్రసారం కాకుండా తూర్పు గోదావరి జిల్లాలో ఇంటర్ నెట్ ఫైబర్ కేబుల్ ను కట్ చేశారు. ఈ సంఘటనపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు.

ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఇందుకు కారకులైన వారికి శిక్షపడేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలను తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం పాటుపడుతుంటే, ఇలాంటి ఘటనలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. కాగా, ఆరు చోట్ల కేబుల్ ని కట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే, కేబుల్ కట్ చేసినప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రాష్ట్రపతి పర్యటన ప్రసారమయ్యేలా చూశారు.

  • Loading...

More Telugu News