jagadish reddy: ప్రతిష్ఠాత్మక విద్యాల‌యాల్లో సీట్లు సంపాదించిన గురుకులాల విద్యార్థులు!: మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ప్రశంసలు

  • ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్ఐఎఫ్‌టీ లాంటి సంస్థ‌ల్లో సీట్లు
  • విద్యార్థుల‌కు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించిన మంత్రి
  • అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దని నిరూపించారు
  • సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యావకాశాలు ఉండాలి

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ‌ల్లో చదువుకున్న విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాలకనుగుణంగా దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్ఐఎఫ్‌టీ లాంటి సంస్థ‌ల్లో సీట్లు సాధించి గర్వకారణంగా నిలిచార‌ని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. దేశంలోని వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థ‌ల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ రోజు తెలంగాణ‌ సచివాలయంలో ఆయ‌న‌ ల్యాప్ టాప్ లు అందించారు. ఈ కార్యక్రమంలో షెడ్డ్యూల్డు కులాల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, గురుకుల విద్యాలయాల సంస్థ‌ కార్యదర్శి ఆర్.ఎన్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

దేశంలో ప్ర‌తిష్ఠాత్మ‌క విశ్వ విద్యాల‌యాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు సీట్లు సాధించడం గొప్ప విషయమని, వారికి అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దని నిరూపించారని మంత్రి అభినందించారు. తెలంగాణలోనే నాణ్యమైన విద్యతో పాటు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యనందించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకునేలా ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

తెలంగాణ గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబరచి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సెక్రటరీ, అధ్యక్షులు, ప్రిన్సిపాల్, టీచర్ల కృషికి ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యావకాశాలు ఉండాలన్న భావంతో ప్రభుత్వం గురుకులాల సంఖ్య పెంచడంతో పాటు, మంచి భోజన వసతిని అందిస్తున్నామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News