whatsapp: మధ్య వేలు ఎమోజీని తొలగించాలంటూ వాట్సాప్‌కి లీగల్ నోటీసులు
- అది భారతదేశంలో అసభ్యకరమని వ్యాఖ్య
- 15 రోజుల్లోగా తొలగించాలని హెచ్చరిక
- నోటీసులు పంపిన ఢిల్లీ న్యాయవాది
సమాచార మాధ్యమం వాట్సాప్‌లో ఉన్న మధ్య వేలు ఎమోజీని తొలగించాలంటూ న్యూ ఢిల్లీకి చెందిన న్యాయవాది గుర్మీత్ సింగ్ సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. భారతదేశంలో మధ్య వేలును చూపించడం అసభ్యకరమని పేర్కొంటూ 15 రోజుల్లోగా ఆ ఎమోజీని తొలగించాలని లేకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకునేందుకు కూడా వెనకాడబోమని గుర్మీత్ సింగ్ తెలిపారు.
'భారత నేర శిక్షాస్మృతి 354, 509 సెక్షన్ల ప్రకారం మహిళలకు అసభ్యకర సంజ్ఞలు చూపించడం నేరం. అలా చేయడం చట్టరీత్యా శిక్షార్హం. అంతేకాకుండా ఐర్లాండ్ వంటి దేశాల్లో కూడా మధ్య వేలు చూపించడం నేరం. మీ (వాట్సాప్) యాప్‌లో ఆ సంజ్ఞ ఉపయోగించడం ద్వారా నేరాలను ప్రొత్సహిస్తున్నారు. అందుకే 15 రోజుల్లోగా ఆ ఎమోజీని తొలగించాలని కోరుతున్నాం' అని సింగ్ నోటీసులో వెల్లడించారు. అయితే దీనిపై వాట్సాప్ వారు ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.