Police: హైదరాబాద్‌లో రంగంలోకి 100 పోలీస్ టీమ్ లు.. 31న రాత్రంతా తనిఖీలు!
- మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే కేసులు నమోదు
- వాహనాన్ని కూడా సీజ్ చేస్తాం
- రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
- హెచ్చరించిన డీసీపీ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ నగరం నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైంది. ఈ నెల 31 (ఆదివారం) అర్ధరాత్రి రోజున నగరంలోని రోడ్లపై యువత చేసే హంగామాయే వేరు. ఈ నేపథ్యంలో రోడ్లను జీరో యాక్సిండెంట్ నైట్‌గా చేయాలని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వ్యూహాన్ని సిద్ధం చేసుకుని పలు విషయాలు తెలిపారు. ఆ రోజు రాత్రంతా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.
ఈ రోజు డీసీపీ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రోజు రోడ్లపై రాత్రి 10 నుంచి తెల్లవారుజాము ఒంటి గంట వరకు తనిఖీలు ఉంటాయని, కానీ ఈ ఆదివారం రోజు మాత్రం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
సాధారణ రోజుల్లో ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో చేసే సోదాల్లాగే ఈ ఆదివారం కూడా తనిఖీలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ లో తనిఖీల కోసం మొత్తం 100 టీమ్ లను విధుల్లో ఉంచుతున్నట్లు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే వారి వాహనాన్ని సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.