akhila priya: దేశ ప్రథమ మహిళ సవిత కోవింద్ రాక.. పర్యటన ముగిసేవరకు ఆమెతోనే భూమా అఖిలప్రియ!
- కార్యక్రమాలకు నేతృత్వం వహించనున్న పర్యాటక శాఖ
- తొలి సందర్శన గులాబీల ప్రదర్శన
- కనకదుర్గమ్మకు రాష్ట్రపతి సతీమణి ప్రత్యేక పూజలు
- భవానీ ఐలాండ్‌లో హస్తకళాకారులతో భేటీ
భారత రాష్ట్రపతి సతీమణి, దేశ తొలి మహిళ సవిత కోవింద్ రాష్ట్ర పర్యటనకు పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సవితా కోవింద్ తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తుండగా, ఆమె పర్యటనకు సంబంధించిన బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖకు అప్పగించింది. ఈ నేపధ్యంలో మంగళవారం సచివాలయంలో భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యటనకు సంబంధించిన వివిధ అంశాలు, ప్రయాణ మార్గాలపై చర్చించారు.
ముసాయిదా కార్యక్రమాన్ని అనుసరించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ దంపతులు ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. రాష్ట్రపతి అక్కడి నుండి నేరుగా నాగార్జున విశ్వవిద్యాలయం చేరుకుంటారు. విమానాశ్రయం వద్ద పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, ఎ.పి. టి.డి.సి ఎండి హిమాన్హు శుక్లా తదితరులు సవితా కోవింద్‌ను స్వాగతించి, పర్యటన ముగిసే వరకు ఆమెతోనే ఉంటారు. తొలుత ప్రధమ మహిళ విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న గులాబీల ప్రదర్శన స్థలానికి చేరుకుంటారు.
ప్రదర్శన తిలకించిన అనంతరం సవిత ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనక దుర్గమ్మ చెంతకు చేరుకుని, అమ్మవారిని సందర్శించుకుని దీవెనలు అందుకుంటారు. దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.30 గంటలకు దేవాలయం నుండి బయలుదేరి భవానీపురం పున్నమి ఘాట్‌కు చేరుకుంటారు. అక్కడ పర్యాటక శాఖ నూతనంగా నిర్మించిన అతిథి గృహాలను సందర్శించి స్వల్ప విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ హిహాన్హు శుక్లా రాష్ట్ర పర్యాటక శాఖ కార్యకలాపాలను ప్రథమ మహిళకు వివరిస్తారు. అక్కడి నుండి నదీ విహారం ద్వారా భవానీ ఐలండ్‌కు చేరుకుంటారు. భవానీ ద్వీపంలో సాంస్కృతిక శాఖ విశేష ఏర్పాట్లను చేయాలని సమీక్ష నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు.
కళా బృందాలతో తొలి మహిళను ద్వీపంలోకి స్వాగతించాలని సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్‌కు సూచించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కొమ్ముకోయ, సవర, డప్పులు, గరగలు, కూచిపూడి నృత్యరీతులను ఇక్కడ ప్రదర్శింపచేస్తారు. మరోవైపు తెలుగుదనానికి చిహ్నంగా భాసిల్లే కొండపల్లి బొమ్మలను పరిశీలించి హస్తకళాకారులతో ప్రత్యేకంగా మాట్లాడతారు. అనంతరం భవానీ ఐలండ్ నుండి బయలు దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు వెలగపూడి సచివాలయం చేరుకుంటారు. ఇక్కడి నుండి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో కలిసి గన్నవరం చేరుకుంటారు. మరోవైపు రూట్ మ్యాప్ వంటి అంశాలపై పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఎపిటిడిసి అధికారులను ఆదేశించారు.