france: ఆర్థికపరంగా బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలను దాటనున్న భారత్
- ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ
- 2018లోగా సాధ్యం
- సెబర్ నివేదికలో వెల్లడి
డాలర్ పరంగా 2018లోగా భారత దేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. సెంటర్ ఫర్ ఎకానమిక్స్ అండ్ బిజినెస్ రీసర్చ్ (సెబర్) కన్సల్టెన్సీ ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థపై అధ్యయనం చేసి, ఓ నివేదిక రూపొందించింది. ఆర్థికపరంగా బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలను ఇండియా దాటి పోతుందని ఈ నివేదిక వెల్లడించింది.
అలాగే వచ్చే 15 ఏళ్ల వరకు ఆర్థిక వ్యవస్థలో ఆసియా దేశాలే ఉన్నత స్థాయిలో ఉండనున్నాయని సెబర్ డిప్యూటీ ఛైర్మన్ డాగ్లస్ మెక్‌విలియమ్స్ అన్నారు. కానీ పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి భారీ ఆర్థిక సంస్కరణల వల్ల ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కొంత నెమ్మదిగా సాగుతోందని ఆయన అన్నారు. ఆ సంస్కరణల ప్రభావం వల్ల త్వరలోనే పుంజుకుంటుందని మెక్‌విలియమ్స్ పేర్కొన్నారు. అంతేకాకుండా 2032 నాటి అమెరికాను అధిగమించి ఆర్థిక వ్యవస్థలో చైనా అగ్రస్థానంలో నిలుస్తుందని సెబర్ నివేదికలో పేర్కొంది.